
భారత్-పాక్ ఉద్రిక్తతలపై ఐక్యరాజ్యసమితి ఏం చెబుతోందంటే…!
పహల్లామ్ దాడి తర్వాత భారత్ – పాక్ మధ్య పెరిగిన ఉద్రిక్తతలు
ఇరుదేశాలు సంయమనం పాటించాలి: ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్
సైనిక చర్య మాత్రం పరిష్కారం కాదని వ్యాఖ్య
దౌత్యాన్ని, శాంతిని పునరుద్దరించేలా ఏ చర్యకైనా మద్దతుకు ఐరాస సిద్దం: ఆంటోనియో గుటెరస్
పహల్గామ్ ఉగ్రదాడి ఘటనతో భారత్, పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఐక్యరాజ్య సమితి కీలక ప్రకటన చేసింది. న్యూయార్క్ లోని ఐరాస కార్యాలయంలో ఆ సంస్థ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ మాట్లాడారు.
ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు కొన్నేళ్లుగా ఎన్నడూ లేనంతగా తీవ్ర స్థాయికి చేరడం బాధాకరమని ఆయన అన్నారు. ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రదాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ దాడిలో బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఇరు దేశాలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు.
పౌరులను లక్ష్యంగా చేసుకోవడం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నారు. ఈ కీలక సమయంలో సైనిక ఘర్షణ నివారించడం ముఖ్యమని పేర్కొన్నారు. వీలైనంత ఎక్కువగా సంయమనం పాటించాల్సిన సమయం ఇదేనని ఆయన అన్నారు.
ఉగ్రదాడి తర్వాత ప్రజల్లో భావోద్వేగాలను తాను అర్ధం చేసుకోగలనని, ఇందుకు సైనిక చర్య మాత్రం పరిష్కారం కాదన్నారు. పొరపాట్లు చేయవద్దని, సంయమనం పాటించాలని ఇరు దేశాలకు ఆయన హితవు పలికారు. ఉద్రిక్తతలు తగ్గించే దౌత్యాన్ని, శాంతిని పునరుద్ధరించేందుకు అవసరమైన ఏ చర్యకైనా మద్దతు ఇచ్చేందుకు ఐరాస సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
Be the first to comment