
వాజ్ పాయ్ శతజయంతి వేడుకలు సందర్భంగా ఢిల్లీ వెళ్లిన సిఎం చంద్రబాబు – ఎన్డీయే కూటమి నేతల కీలక భేటీ
అధికార ఎన్డీయే(NDA) కూటమి భాగస్వామ్యపక్షాలు 25న బుధవారం దిల్లీలో భేటీ కానున్నాయి. దివంగత నేత, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయీ శత జయంతి వేడుకల నేపథ్యంలో ఎన్డీయే నేతలు ఆయనకు ఘనంగా నివాళులర్పించనున్నారు. అనంతరం భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డ నివాసంలో బుధవారం సాయంత్రం 4గంటలకు భేటీ కానున్నట్లు సమాచారం. దేశంలో తాజా రాజకీయ పరిస్థితులు, ఇటీవల పార్లమెంటు సమావేశాల్లో చోటుచేసుకున్న ఘటనల, తదుపరి కార్యాచరణపై చర్చించే అవకాశం ఉంది. ఈ కీలక భేటీకి తెదేపా అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సహా ఎన్డీయే పక్షాలకు చెందిన నేతలు హాజరుకానున్నారు.
రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేడ్కర్పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారం నెలకొంది. దీంతో ఈ అంశంపై ఎన్డీయే మిత్రపక్షాల మధ్య మరింత మెరుగైన సమన్వయం సాధించడంతో పాటు కాంగ్రెస్ కు గట్టిగా సమాధానం చెప్పే విషయంపైనా ఎన్డీయే మిత్రపక్షాల నేతలు చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం జేపీసీ పరిశీలనకు పంపాలని నిర్ణయించిన జమిలి ఎన్నికలు, వక్స్ సవరణ బిల్లుల విషయంలో అనుసరించాల్సిన వ్యూహాలు, వచ్చే ఏడాదిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో కూటమి పక్షాల మధ్య సీట్ల సర్దుబాటు వంటి పలు అంశాలపైనా ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది. ఇటీవల పార్లమెంటు సమావేశాల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎన్డీయే భాగస్వామ్య పక్షాల మధ్య మరింత సమన్వయం పెంపొందించేందుకు వీలుగా ప్రతి నెలా సమావేశం కావాలని సూచించిన విషయం తెలిసిందే.
Be the first to comment