మోహన్ బాబు వర్సెస్ మనోజ్

మోహన్ బాబు వర్సెస్ మనోజ్ – అసలు సమస్యేమిటో !

మంచు మోహన్ బాబు, మంచు మనోజ్ ఇద్దరూ పరస్పర ఆరోపణలు చేసుకుంటూ లేఖలు విడుదల చేశారు. మనోజ్ కు తన తండ్రిపై కేసు పెట్టడం ఇష్టం లేక గుర్తు తెలియని వ్యక్తులని ఫిర్యాదు చేశాడు. కానీ మోహన్ బాబు మాత్రం తన కుమారుడితో పాటు కోడలిపైనా తీవ్రమైన ఆరోపణలు చేశారు.దానికి మనోజ్ కౌంటర్ లేఖ విడుదల చేశారు. ఎంబీయూ లో చేస్తున్న అక్రమాలపై ప్రశ్నించినందుకే తనను వేధిస్తున్నారని.. ఆస్తుల కోసం తాను వెంటపడలేదని మనోజ్ అంటున్నారు. కానీ అసలు ఈ గొడవలకు కారణం ఏమిటో మాత్రం ఎవరూ స్పష్టత ఇవ్వలేదు.

మోహన్ బాబు అబద్దాలు చెబుతున్నారన్న మనోజ్

మనోజ్ రాత్రి పొద్దుపోయాక సుదీర్ఘమైన లేఖను విడుదల చేశారు. మోహన్ బాబు తన విషయంలో అన్ని అబద్దాలు చెబుతున్నారని.. పసిబిడ్డను కూడా వివాదాల్లోకి లాగారని అసంతృప్తి వ్యక్తం చేశారు. వారు కోరితేనే ఏడాది కిందట నుంచి ఇంట్లో ఉంటున్నామని స్పష్టం చేశారు.తాము ఆస్తుల కోసం ఎప్పుడూ ఒత్తిడి చేయలేదని ..కుటుంబంపై ఆధారపడి బతకడం లేదన్నారు. అయితే విష్ణును మాత్రం మొదటి నుంచి ప్రోత్సహిస్తున్నారని కుటుంబ వనరులన్నీ దోచి పెడుతున్నారని స్పష్టం చేశారు. మనోజ్ చాలా వాటికి క్లారిటీ ఇచ్చారు. అస్తుల కోసం కాకపోతే అసలు ఈ గొడవ ఎందుకు అనే ప్రశ్నకు ఆయన ఇచ్చిన సమాధానం వింతగాఉంది. మోహన్ బాబు యూనివర్శిటీలో అవకతవకలు జరుగుతున్నాయని దాన్ని ప్రశ్నించినందుకే తనపై దాడి చేస్తున్నారని అంటున్నారు. కానీ ఇదంతా నమ్మశక్యంగా లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది.

కొడుకుపై అంత తీవ్రమైన ఆరోపణలు మోహన్ బాబు ఎందుకు చేస్తున్నారు

మోహన్ బాబు తన కుమారుడు తాను నివాసం ఉంటున్న ఇంటిని కబ్జా చేయడం కోసమే తనను చంపడానికి కూడా వెనుకాడరన్నట్లుగా పోలీసులకు లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. భూమా మౌనికను ఆయన టార్గెట్ చేయడంతో కుటుంబ వివాదాలు చాలా తీవ్రంగా ఉన్నాయని అర్థమవుతుంది. ఆ ఇంటిని మనోజ్ లాగేసుకుంటే చట్ట పరంగా మనోజ్ ది అయిపోదు కదా. అయినా కుమారుడితో ఇంత ఈగోకు వెళ్లాల్సిన అవసరం ఏముంది ?. బయటకు చెబుతున్న దాని కన్నా.. పెద్ద ఇష్యూ ఏదో ఇద్దరి మధ్య జరిగిందన్న అభిప్రాయం ఉంది. కానీ అదేంటో చెప్పడం లేదు.

ఇంత కాలం తెచ్చుకున్న పేరు ప్రతిష్ఠలన్నీ నాశనం

కారణం ఏమైనా మోహన్ బాబు అంటే..ఓ లెజెండరీ యాక్టర్ గా అందరికీ తెలుసు. ఇప్పుడు ఆయన కుటుంబంలో చెలరేగిన వివాదం.. ఆయన వ్యవహరిస్తున్న తీరుతో మొదటికే మోసం వస్తోంది. ఆయన ఏళ్లపాటు తెచ్చుకున్న గౌరవమర్యాదలన్నీ పాతాళానికి పడిపోతున్నాయి. ఆయన కుటుంబ గొడవలను వీలైనంత త్వరగా సెటిల్ చేసుకుని కలిసిపోతే బాగుంటుందన్న అభిప్రాయం ఎక్కువమందిలో ఉంది.కానీ మోహన్ బాబు పంతాలకు పోతున్నారని ఆయన లేఖతోనే అర్థమవుతుందన్న వాదన వినిపిస్తోంది.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*