పిఠాపురం నియోజకవర్గంలోని అనాథ పిల్లలకు అండగా నా వేతనం

నా జీతం… మీ జీవితం కోసం…

పిఠాపురం నియోజకవర్గంలోని అనాథ పిల్లలకు అండగా నా వేతనం

ఒక్కొక్కరికీ రూ. 5వేల చొప్పున సాయం… మిగిలిన వేతనం వారి బాగోగులకే

ప్రతి నెలా ఇంటి వద్దనే అందించేలా ప్రణాళికలు

పదవి ఉన్నంతకాలం సాయం కొనసాగుతుందని ప్రకటించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ Pawan Kalyan గారు.

పిఠాపురం నియోజకవర్గ ప్రజల సంక్షేమంతోపాటు సమస్యల పరిష్కారం నా బాధ్యత

పిఠాపురం నియోజకవర్గంలో కన్నవారు దూరమైన బిడ్డలతో మాటామంతీ

‘పిఠాపురం నియోజకవర్గ ప్రజలు ఎంతో నమ్మకంతో శాసనసభ్యుడిగా గెలిపించారు. వారి ఆకాంక్షలకు అనుగుణంగా నియోజకవర్గ అభివృద్ధితోపాటు సమస్యలను పరిష్కరించడం నా బాధ్యత’ అని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పేర్కొన్నారు. పిఠాపురం ప్రజలు ఇచ్చిన అధికారం ద్వారా వచ్చిన జీతాన్ని అక్కడే వినియోగించాలని నిర్ణయించుకున్నాను… అందులో భాగంగా నియోజకవర్గం పరిధిలోని తల్లిదండ్రులు లేని బిడ్డల భవిష్యత్తు కోసం ఆ మొత్తం ఇస్తున్నట్టు తెలిపారు. పదవి ఉన్నంతకాలం వచ్చే జీతం మొత్తాన్ని ఆ బిడ్డల సంక్షేమానికి వినియోగించనున్నట్టు స్పష్టం చేశారు. శుక్రవారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పిఠాపురం నియోజకవర్గానికి చెందిన 42 మంది అనాథ పిల్లలకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తన వేతనం నుంచి ఒక్కొక్కరికీ నెలకి రూ. 5 వేల చొప్పున రూ. 2,10,000 ఆర్థిక సాయం అందించారు. జీతంలో మిగిలిన మొత్తాన్ని కూడా వారి బాగోగులు చూసేందుకే ఖర్చు చేయనున్నట్టు ప్రకటించారు. శుక్రవారం అందుబాటులో ఉన్న 32 మందికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్వయంగా సాయాన్ని అందజేశారు. మిగిలిన పది మందికీ జిల్లా యంత్రాంగం ద్వారా ఆ మొత్తాన్ని అందిస్తామని తెలిపారు. ప్రతి నెలా ఈ సాయం వారి ఇళ్ల వద్దే అందించేలా ఏర్పాట్లు చేశారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని శాసన సభ్యుడిగా ఎన్నికైన తర్వాత వేతనం తీసుకోకూడదని నిర్ణయించుకున్నాను. ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలన్న భావనతోనే వేతనం తీసుకున్నాను. వేతనం రూపంలో తీసుకున్న ఆ మొత్తాన్ని నన్ను గెలిపించిన పిఠాపురం నియోజకవర్గం పరిధిలో కన్నవారు దూరమైన పిల్లల భవిష్యత్తు కోసం, వారి చదువుల ఖర్చు చేయాలనుకున్నాను. ప్రభుత్వం, పదవి ఉన్నంతకాల జీతం మొత్తం అనాథ బిడ్డల సంక్షేమానికి వినియోగిస్తాను” అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ శ్రీ మైలవరపు కృష్ణ తేజ, కాకినాడ జిల్లా కలెక్టర్ శ్రీ షణ్మోహన్ సగిలి, పాడా ప్రాజెక్ట్ డైరెక్టర్ చైత్ర వర్షిణి తదితరులు పాల్గొన్నారు.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*