
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎస్వీ రంగారావు
శరీరం, మనసు రెండు కలిపి చిలికితేగాని మంచి నటనరాదు.హాస్య, శృంగార, కరుణ, రౌద్ర, వీర, భయానక, భీభత్స, అద్భుత, శాంత రసాలన్నింటిని, అక్బరు, ఘటో త్కచుడు, హరిచ్చంద్రుడు, నరకాసురుడు, ప్రవరుడు, కంసుడు, రావణుడు, కీచకుడు, హిరణ్యకశిపుడు, మాంత్రికుడు, కోటయ్య, వియ్యన్న, కత్తులరత్త య్య,ఒకటేమిటి అనేకానేక పాత్రల ద్వారా ప్రదర్శించారు. కనుకనే ఆయన విశ్వనట చక్రవర్తి అయ్యారు. జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతిని పొందారు. 1918 జులై 3 న కృష్ణా జిల్లా నూజివీడులో జన్మించారు. తండ్రి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్, తాత నూజివీడు హాస్పిటల్ లో పేరున్న సర్జన్, మేనమామ పేరున్న రాజకీయనాయకుడు, లాయర్. మద్రాస్ హిందూ హైస్కులులో చదువుకుంటూ 15 వ ఏట నటునిగా స్టేజ్ ఎక్కారు. క్రికెట్, వాలీబాల్,టెన్నిస్ లలో మంచి ప్రవేశం ఉండేది. కాకినాడ యంగ్ మెన్స్ హాపీ క్లబ్ ద్వారా ఆదినారాయణరావు, అంజలీదేవి, B.A సుబ్బారావు, రేలంగి వాళ్ళతో పరిచయాలెర్పడ్డాయి. షేక్స్ పియర్ నాటకాలు, సీజర్, ఆంటోని, షైలాక్ పాత్రలను అవలీలగా పోషించేవారు. BSC పూర్తయిన తరువాత ఫైర్ ఆఫీసర్ గా బందరు, విజయనగరంలలో చేశారు. 11-1-1947 లో రంగారావు హీరోగా, దాసరి తిలకం (గిరిజ తల్లి ) హీరోయిన్ గా “వరూధిని” రిలీజయ్యింది. తదుపరి చిత్రం ‘షావుకారులో ‘ సున్నం రంగడిగా రౌడీ పాత్ర వేశారు. ఈ పాత్ర తనగ్రామంలో కోడి రంగడనే రౌడీని దృష్టిలోపెట్టుకుని చేశారు. పాతాళ భైరవి (1951)లో నేపాళ మాంత్రికుడి పాత్రతో S. V. రంగారావు నటవిశ్వరూపం మొదలయింది. ఇదే చిత్రాన్ని జెమిని వారు హిందీలో రంగారావు తోనే తీశారు. ఇంగ్లీషు నాటకాలలోని షైలాక్ పాత్రను ఆధారం చేసుకుని దానికి మరింత రౌద్ర రసాన్ని కలిపి మాంత్రికుని పాత్రను పోషించి విశ్వ విఖ్యాతి గాంచారు.’మై లడకీ హు’ అనే హిందీ చిత్రాన్ని కూడా చేశారు. ప్రాచీన గ్రంధాలు నటనను నాలుగు రీతులుగా అంటే అంగిక, వాచిక, ఆహార్య, సాత్వికాభినయాలుగా విభజించారు. ఈ నాలుగు రీతులు రంగారావు లో పుష్కలంగా ఉన్నాయి. మద్రాస్ స్టేషన్లో ఒక వ్యక్తి మధ్య మధ్యలో కళ్ళు తిప్పడం, మెడ ప్రక్కకు వాల్చడం వంటి మేనరిజమ్స్ ను తన ‘పెళ్లిచేసిచూడు’ చిత్రంలో వియ్యన్న పాత్రలో చొప్పించారు. ముష్టి ఎత్తు కునే ముసలి గ్రుడ్డి వానిని ఒక రోజంతా గమనించి ‘సంతానం’లోని గ్రుడ్డి వాని పాత్ర చేశారు. 1950 నుండి 1970 వరకు స్వర్ణ యుగమైతే ఈ రెండు దశాబ్దాల కాలంనాటి పౌరాణికాలు S.V.రంగారావు, N. T. రామారావు లేకుండా ఉహించుకోలేము. కన్నాంబ సొంత సినిమా ‘ సతీ సావిత్రిలో ‘ S. V. రంగారావు యముని పాత్ర చూసి జెమిని స్టూడియోలో నాటి చైనా ప్రధాని శ్రీ చౌ ఎన్ లై అదిరిపడటం S. V. R. ని అభినందించడం జరిగింది. ‘హా…. బానిసలు…. బానిసలకు ఇంత అహంకారమా ‘ అనే చిన్న డైలాగు పాండవవనవాసంలోని దు ర్యోధనుని పాత్ర మన కళ్ళముందు ప్రత్యక్ష మవ్వాల్సిందే. ‘ నర్తనశాలలో దాదాపు సగం సినిమా అయినాకే కీచకుని పాత్ర ప్రవేశిస్తుంది. ఆ పాత్ర మిగతా పాత్రలన్నింటిని డామినేట్ చేస్తుంది. అందుకే జాకార్తా, అఫ్రో, ఎషియన్ ఇంటర్నెషనల్ ఫిలిమ్ ఫెస్టివల్ లో ఉత్తమ నటుడిగా ఇండోనేషియా అధ్యక్షుడు డాక్టర్ సుకర్నో చేతుల మీదుగా అంతర్జాతీయ అవార్డు అందుకోవటం జరిగింది. అంతవరకు ఏ భారతీయ నటుడు అలా అంతర్జాతీయ అవార్డు అందుకోలేదు. అందుకే ఆంగ్ల దర్శకులు S. V. R. మా దేశంలో పుట్టివుంటే ఆస్కార్ అవార్డు అందుకునే వాడన్నారు. అనార్కలి లో అక్బర్, బాలనాగమ్మలో మాయల ఫకీరు,కృష్ణాంజనేయ యుధం లో వాసుదేవుదు, దీపావలిలో బాణాసురుడు, కాళిదాసులో భోజమహారాజు, బొబ్బిలి యుద్ధం లో తాండ్ర పాపారాయుడు అన్నీ విభిన్న పాత్రలే. ప్రపంచ వ్యాప్తంగా చూసుకున్నా పౌరాణికాలు చెయ్యాలంటే మన తెలుగువారిదే అగ్రస్థానం. సీతగా, రుక్మిణిగా అంజలీదేవి, ద్రౌపదిగా సావిత్రి, సత్యభామగా జమున, నారదుడుగా కాంతారావు, రాముడు, కృష్ణుడు, శ్రీమహా విష్ణువు, రారాజుగా, శ్రీకృష్ణదేవరాయలుగా N. T. R., శశిరేఖగా L.విజయలక్ష్మి, ఉత్తరకుమారుడుగా రేలంగి, ఆంజనేయుడుగా,ఇంద్రుడుగా రాజనాల,సైందవుడు, శిశుపాలుడుగా R. నాగేశ్వరరావు, ధర్మరాజుగా, తిమ్మరుసుగా గుమ్మడి, భీముడుగా దండమూడి రాజగోపాలరావు, ఆంజనేయుడుగా ఆర్జా జనార్ధనరావు,గయుడు, యయాతి, శకుని గా ధూళిపాళ్ళ, అభిమన్యుడు గా శోభనబాబు, వేమన, త్యాగయ్య, రామదాసు గా చిత్తూరు నాగయ్య గార్లకు ప్రత్యామ్ నాయం లేదు. అందుకే తెలుగువాడిగా పుట్టినందుకు గర్విద్దాం.
బుడగాల సుబ్బారావు, ఘంటసాల కళాపరిషత్ వ్యవస్థాపక అధ్యక్షులు, పల్నాడు జిల్లా తెలుగుదేశం ఉపాధ్యక్షులు.
Be the first to comment