బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీకృష్ణదేవరాయలు

శ్రీకృష్ణదేవ రాయలు (పా.1509-1529) అత్యంత ప్రసిద్ధవిజయనగర సామ్రాజ్య చక్రవర్తి. ఈయన పాలనలో సామ్రాజ్యము అత్యున్నతస్థితికి చేరుకున్నది. కృష్ణరాయలను తెలుగు మరియు కన్నడ ప్రజలు భారతదేశాన్ని పాలించిన గొప్ప చక్రవర్తులలో ఒకడిగా అభిమానిస్తారు. సాహిత్యములో ఈయన ఆంధ్ర భోజుని గా మరియు కన్నడ రాజ్య రమారమణ గా కీర్తించబడినాడు.

ఈయన పాలనను గురించిన సమాచారము పోర్చుగీసు సందర్శకులు డొమింగో పేస్ మరియు న్యూనిజ్ ల రచనల వలన తెలియుచున్నది. రాయలకు ప్రధాన మంత్రి తిమ్మరుసు. శ్రీకృష్ణదేవరాయలు సింహాసనం అధిష్ఠించడానికి కూడా తిమ్మరుసు చాలా దోహదపదడినాడు. కృష్ణరాయలు తిమ్మరుసును పితృసమానునిగా గౌరవించేవాడు.కృష్ణదేవ రాయలు, తుళువ నరస నాయకుడు, నాగలాంబల (తెలుగు ఆడపడుచు) కుమారుడు.[1] ఇతను ఇరవై సంవత్సరాల వయసులో ఫిబ్రవరి 4, 1509న విజయనగర రత్నసింహాసనాన్ని అధిష్ఠించినాడు. ఇతని పట్టాభిషేకానికి అడ్డురానున్న అచ్యుత రాయలు నూ, వీర నరసింహ రాయలునూ, అనుచరులనూ తిమ్మరుసు సుదూరంలో ఉన్న దుర్గములలో బంధించినాడు.

రాజ్యం అధిష్ఠానం ఇతను రాజ్యం అధిష్ఠించునాటికి రాజ్యమంతా చాలా గందరగోళంగా ఉన్నది. దక్షిణాన సామంతులు స్వతంత్రులు అయినారు, తీరాంధ్ర ప్రాంతాన్ని గజపతులు ఆక్రమించుకొని తమ రాజ్యంలో కలుపుకొని, కొండవీడు, ఉదయగిరి వంటి పటిష్ఠమైన దుర్గములతో బ్రహ్మాండమైన రక్షణ ఏర్పాట్లు చేసుకున్నారు. బహమనీ సుల్తానులు రాజ్యంలోనికి రోజురోజుకూ చొచ్చుకొని రాసాగినారు. ఇటువంటి అస్తవ్యస్త పరిస్థితులలో శ్రీకృష్ణదేవరాయలు రాజ్యానికి వచ్చినాడు.

ఇతను 1509లో సింహాసనం అధిష్ఠించి, 1512 వరకూ మూడు సంవత్సరములు సైనిక సంపత్తిని పెంపొందించుకొని తొలిసారిగా దక్షిణ దేశ దిగ్విజయ యాత్రకు బయలుదేరినాడు.కావేరీ నదీ తీరంలోని శివపట్టణ పాలకుడు, విజయనగర సామంతుడైన గంగరాజు, విజయనగర రాజుల అలసత్వాన్ని ఆధారంగా చేసుకొని కప్పం చెల్లించక స్వతంత్రముగా ఉండసాగినాడు. ఇతని శత్రువు శ్రీ రంగపట్టణ రాజు చిక్క రాయలు. చిక్క రాయలు శ్రీకృష్ణదేవరాయల సైన్యంలో చేరి గంగరాజుపై యుద్ధం చేసి గెలిచినాడు. గంగరాజు కావేరి నదిలో పడి ప్రాణాలు వదిలినాడు.తరువాత ఉమ్మత్తూరు, కర్ణాటక, మైసూరు ప్రాంతములను చేజిక్కించుకొని చిక్క రాయలును వాటికి సామంతుని గా చేసినాడు. తరువాత చిన్న చిన్న పాలెగాండ్లను జయించి ఆ ప్రాంతములకు కెంపెగౌడ, వీర గౌడలను పాలకులుగా నియమించినాడు. (ఈ కెంపేగౌడ, వీర గౌడలే బెంగళూరు నిర్మాతలు). తరువాత మలయాళ ప్రాంతములను జయించి, వారినుండి కప్పములను వసూలు చేసినాడు. విజయప్ప, వేంకటప్ప నాయకులను పాండ్యదేశమునకు, దాని పరిసరాలకూ సామంతులుగా నియమించినాడు. విజయప్పనాయుడు, వెంకటప్ప నాయుడుతో కలసి రాయలువారి ఆదేశముపై చిత్తూరు, జింజి, తొండ మండలము, మధుర, తిరునగరు, తిరుచినాపల్లి మొదలగు ప్రాంతములను జయించినాడు. వీరందరి నుండి ఎంతో కప్పమును వసూలు చేసినాడు. ఒక్క జింజి నగరమునుండే సంవత్సరమునకు మూడు కోట్ల రూపాయల విలువైన కప్పం వచ్చేది. దీనితో దక్షిణ దేశమంతా రాయలు స్వాధీనమైనది.ఈ తూర్పు దిగ్విజయ యాత్రలో భాగంగా 1513లో ఉదయగిరి ని ముట్టడించినాడు. రాయసము కొండమరుసు విజయనగర సేనలకు ఆధిపత్యము వహించి సంవత్సరమున్నర పాటు తీవ్రమైన పోరాటము చేసి దుర్గమును స్వాధీనము చేసుకున్నాడు. తరువాత ఉదయగిరి ప్రాంత రాజప్రతినిధిగా అతడే నియమితుడయ్యాడు. 1515లో రాయలు కొండవీడు ను ముట్టడించినాడు. కొండవీడు 1454నుండి గజపతుల ఆధీనంలో ఉన్నది. ఇదే సమయంలో ప్రతాపరుద్ర గజపతి కృష్ణానది ఉత్తర భాగమున పెద్ద సైన్యంతో విడిదిచేసెను. ఈ యుద్ధమున రాయలు విజయం సాధించాడు. తరువాత రాయలు కొండవీడును అరవై రోజులు పోరాడి 1515 జూన్ 6 న స్వాధీనం చేసుకున్నాడు.

కృష్ణదేవరాయలు స్వయంగా కవిపండితుడు కూడా కావడంతో ఇతనికి సాహితీ సమరాంగణ సార్వభౌముడు అని బిరుదు. ఈయన స్వయంగా సంస్కృతంలో జాంబవతీ కళ్యాణము, తెలుగులో ఆముక్తమాల్యద లేక గోదాదేవి కథ అనే గ్రంథాన్ని రచించాడు. రాయల ఆస్థానమునకు భువన విజయము అని పేరు. భువనవిజయము లో అల్లసాని పెద్దన, నంది తిమ్మన, ధూర్జటి, మాదయ్యగారి మల్లన (కందుకూరి రుద్రకవి), అయ్యలరాజు రామభద్రుడు, పింగళి సూరన, రామరాజభూషణుడు (భట్టుమూర్తి), తెనాలి రామకృష్ణుడు అనే ఎనిమిది మంది కవులు ఉండేవారని ప్రతీతి. వీరు అష్టదిగ్గజములు గా ప్రఖ్యాతి పొందారు.

ఇతను మత సహనం కలవాడు. అనేక వైష్ణవ, శైవ దేవాలయములను నిర్మించినాడు; అనేక దాన ధర్మాలు చేసినాడు. ముఖ్యంగా తిరుమల శ్రీనివాసులకు పరమ భక్తుడు, సుమారుగా ఆరు పర్యాయములు ఆ దేవదేవుని దర్శించి అనేక దానధర్మాలు చేశాడు. ఇతను తన కుమారునికి తిరుమల దేవ రాయలు అని, కుమార్తెకు తిరుమలాంబ అని పేర్లు పెట్టుకున్నాడు. రాయలు విజయనగరాధీశులందరిలోకీ చాలా గొప్పవాడు, గొప్ప రాజనీతిజ్ఞుడు, సైనికాధికారి, భుజబల సంపన్నుడు, ఆర్ధిక వేత్త, మత సహనము కలవాడు, వ్యూహ నిపుణుడు, పట్టిన పట్టు విడువని వాడు, కవి పోషకుడు, రాజ్య నిర్మాత మొదలగున్న సుగుణాలు కలవాడు.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*