అఖిల భారత బలిజ, కాపు కళాకారులు, క్రీడాకారులు.

అఖిల భారత బలిజ, కాపు కళాకారులు, క్రీడాకారులు.

.ఆరణి సత్య నారాయణ : ఆరణి సత్య నారాయణ గారు గుంటూరు పట్టణం సంగడిగుంట ప్రాంతంలో తెలగ కుటుంబంలో మాతా మహుల ఇంట 11. 11. 1898 న జన్మించారు. ఆరణి వారిని బెల్లంకొండ సుబ్బారావు గారు 1912 సం. లో ప్రోత్సహించి గయోపాఖ్యానంలో “సత్యభామ ” వేషం వేయించారు. స్టార్ థియేటర్, గుంటూరు వారి నాటక సంస్థలో చేరి చాలా నాటకాలు వేసి పేరు పొందారు. 1913 లో బండారు రామస్వామి గారి ఆహ్వానంతో గుంటూరు మూన్ థియేటర్ లో చేరి “గయోపాఖ్యానం” లో సత్యభామ,” బల్హణీయం” లో యామిని, పూర్ణతిలక, “బొబ్బిలి యుద్ధంలో” మల్లమదేవి, “రసపుత్ర ” లో పద్మిని, ” పాదుషా పరాభవంలో ” ఇందిరా, ” హరిచ్చంద్ర ” లో చంద్రమతి పాత్రలు సమర్ధవంతంగా పోషించారు. తరువాత 1914 లో ప్లీడరు గుమస్తాల నాటక సమాజంలో చేరి విరివిగా స్త్రీ, పురుష పాత్రలు ధరించారు. 1917 లో గుంటూరులో, మరో ప్రాంతంలో జరిగిన హరిచ్చంద్ర నాటక పోటీలలో రెండు చోట్ల బంగారు పతకం సాధించారు. 1918 సం. లో పంగెడిగూడెం జమిందారు వంశీయుడు మోతే నారాయణరావు గారు ఏలూరులో ఏర్పాటు చేసిన నాటక పోటీలలో స్త్రీ పాత్ర ధారణలో బంగారు పతకం పొందారు. 1921 సం. లో సినీ పితామహుడు రఘుపతి వెంకయ్య నాయుడు కుమారుడు రఘుపతి సూర్య ప్రకాష్ మద్రాస్ లో మూకీ సినిమాలు తీస్తూ ” దశావతారాలు ” సినిమాలో విష్ణువు, రాముడు, కృష్ణుడు, కల్కి వంటి పాత్రలు ఆరణి వారి చేత వేయించారు. అనంతరం ” కోవెలన్ కన్యకా పరమేశ్వరి ” వంటి మూకీ సినిమాలలో కూడా నటించారు. అలా 1923 వరకు ఎక్కువగా స్త్రీ పాత్రలే ధరించిన ఆరణి వారు అనంతరం సారంగధరుడు, రాముడు, కృష్ణుడు, సత్యవంతుడు, విశ్వనాధుడు, విదురుడు, కన్వుడు,భరతుడు, నారదుడు, రామదాసు మొదలగు పాత్రలు ధరించారు. 1925 సం. లో అల్లూరి పర్వతరెడ్డి, రామచంద్రారెడ్డి గార్లతో కలిసి ఆరు సం. లు తెలుగు నేల నాలుగు చెరగుల ” రామదాసు ” నాటకం ప్రదర్శించారు. 1933 సం. ఘంటసాల బలరామయ్య గారు ఈస్టిండియా కంపెని తరపున నిర్మించిన ” రామదాసు ” చిత్రంలో రామదాసు గా నటించారు. 17. 6. 1933 న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. బెజవాడ, సరస్వతీ టాకీస్ వారు నిర్మించిన ” ద్రౌపదీ వస్త్రాపహరణం ” చిత్రంలో ” విదురుని ” పాత్ర పోషించారు. ఈ సినిమాలో శ్రీ కృష్ణుడుగా సి.ఎస్. ఆర్. ఆంజనేయులు, పసుపులేటి కన్నాంబ ద్రౌపది గా, ఆమె భర్త దర్శకులు కడారు నాగభూషణం ” అశ్వధామ ” గా నటించిన ఈ సినిమా 29. 2. 1936 లో రిలీజయ్యింది. అలా కొంతకాలం ఆరణి వారు సరస్వతీ డిస్ట్రిబ్యూషన్ కంపెని లో పని చేశారు. 1937 లో కనకతార, బాలయోగిని, 1940 లో చండిక, 1941 లో తల్లి ప్రేమ, 1942 లో సుమతి, 1948 లో ధర్మాంగద, 1949 లో రత్నమాల, లైలా మజ్ను చిత్రాలలో నటించి 1950 సం. లో వినోదా వారి ( దేవదాస్ ) నిర్మాణసంస్థ అకౌంటెంట్ గా పని చేస్తూనే 1952 లో శాంతి, 1953 లో దేవదాస్ వంటి చిత్రాల లోనూ నటించారు. 1957 సం . లో కొందరు మిత్రులతో కలిసి “భభృ వాహన ” చిత్రం ఎన్. టి ఆర్., చలం తో ప్రారంభించారు. ఆర్ధిక ఇబ్బందులతో ఆ చిత్రం ఆగి పోయింది. తరువాత వేరే వారు ఆ చిత్రాన్ని పూర్తి చేసి రిలీజ్ చేశారు. ఆరణి వారు ఆర్ధికంగా, ఆరోగ్యపరంగా దెబ్బతిని గుండెపోటుతో మరణించారు.

వ్యాసకర్త : డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు, మద్రాస్. వీరి స్వస్థలం నరసరావుపేట. వీరి దాయాదులు నరసరావుపేట లో ఉన్నారు.

సేకరణ : బుడగాల సుబ్బారావు, కాపునాడు రాష్ట్ర కార్యదర్శి, పల్నాడు జిల్లా తెలుగుదేశం ఉపాధ్యక్షులు, ఘంటసాల కళా పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షులు.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*