
*డ్వాక్రాకు దీటుగా పురుషుల గ్రూపులు..రుణాలతో చేయూత*
*తొలి విడతగా అనకాపల్లిలో ప్రారంభం*
ఎంతో మంది పేదలు బ్యాంకుల నుంచి రుణాలు పొందలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి వారికి సాయం అందించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. డ్వాక్రా సంఘాల మాదిరిగా పురుషులను కూడా సంఘాలుగా ఏర్పాటు చేయించి వారితో పొదుపు కట్టించి బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించేలా ప్రభుత్వం చర్యలు ఆరంభించింది. తొలివిడతగా అనకాపల్లిలో 28 గ్రూపులు ఏర్పాటు చేయాలనేది లక్ష్యం కాగా ఇప్పటికే 20 గ్రూపులను గుర్తించారు.
డ్వాక్రా సంఘాల మాదిరిగా..
తెదేపా హయాంలో డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేశారు. 10 మంది మహిళా సభ్యులతో ఒక్కో సంఘాన్ని నెలకొల్పి పొదుపు చేయించేవారు. దీని ఆధారంగా బ్యాంకుల నుంచి రుణం తీసుకుని సక్రమంగా చెల్లించే వారికి రుణం పెంచుకుంటూ వచ్చారు. నేడు ఒక్కో సంఘానికి రూ. 20 లక్షల వరకు ఎలాంటి పూచీకత్తు లేకుండా బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి. ఈ తరహాలోనే సీఐజీ గ్రూపులకు తొలివిడతలో రూ. 75 వేల నుంచి రూ. లక్షవరకు రుణం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇది సక్రమంగా చెల్లిస్తే రుణ నగదును పెంచి ఎలాంటి పూచీకత్తులు లేకుండా బ్యాంకుల నుంచి రుణాలు ఇస్తారు. దీనివల్ల స్వయం ఉపాధి పొందేలా వ్యాపార అభివృద్ధికి చర్యలు తీసుకుంటుంది.
కామన్ ఇంట్రస్ట్ గ్రూపులుగా..
భవన నిర్మాణ కార్మికులు, రిక్షా కార్మికులు, వాచ్‌మెన్లు, జొమాటో, సిగ్వీ డెలివరీ బాయ్స్, ప్రైవేటుగా పనిచేస్తువారు ఇలా ఎవరైనా 18 ఏళ్ల నిండి 60 ఏళ్ల లోపు ఉన్న పురుషులు కామన్ ఇంట్రస్టు గ్రూపు (సీఐజీ)లో చేరొచ్చు. తెల్ల రేషన్‌కార్డు, ఆధార్‌ను అనకాపల్లి జీవీఎంసీ జోనల్ కార్యాలయంలోని యూసీడీ కార్యాలయంలో దరఖాస్తులు అందిస్తే వారు గ్రూపును ఏర్పాటు చేస్తారు. ఐదుగురు సభ్యులతో ఒక గ్రూపు సిద్ధం చేస్తున్నారు.
20 సంఘాల ఏర్పాటు
పురుషులతో 20 సంఘాలను ఏర్పాటు చేశాం. ఐదుగురు సభ్యులు వస్తే ఎన్ని గ్రూపులైనా పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. గ్రూపులుగా ఏర్పడితే తక్కువ వడ్డీకి బ్యాంకుల నుంచి రుణాలు పొందొచ్చు. వీటిని సక్రమంగా చెలిస్తే డ్వాక్రా సంఘాల మాదిరిగానే రుణ పరిమితిని బ్యాంకులు పెంచుతాయి.
Be the first to comment