బుల్డోజర్ చర్యలపై సుప్రీంకోర్టు సీరియస్

బుల్డోజర్ చర్యలపై సుప్రీంకోర్టు సీరియస్.. నోటీసు ఇవ్వకుండా కూల్చివేతలు చేయవద్దని ఆదేశాలు

బుల్డోజర్ న్యాయంపై దేశవ్యాప్తంగా చర్చ

నిర్మాణాల కూల్చివేతకు 15 రోజుల ముందు నోటీసులు ఇవ్వాల్సిందేనన్న సుప్రీంకోర్టు

నోటీసులను రిజిస్టర్డ్ పోస్టులో పంపడంతోపాటు నిర్మాణం వెలుపల అంటించాలని ఆదేశాలు

నిర్మాణాలను ఎందుకు కూల్చివేస్తున్నదీ స్పష్టమైన కారణం తెలపాలన్న ధర్మాసనం

రాజ్యాంగ పరిరక్షణకు పౌర హక్కుల పరిరక్షణ చాలా అవసరమని స్పష్టీకరణ

రూల్ ఆఫ్ లాను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరికలు

బుల్డోజర్ చర్యలపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ సుప్రీంకోర్టు బుధవారం కీలక ఆదేశాలు జారీచేసింది. కూల్చివేతకు 15 రోజుల ముందు భవన యజమానికి నోటీసులు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ విషయంలో మార్గదర్శకాలు పాటించాల్సిందేనని పేర్కొంది. రిజిస్టర్ పోస్టులో నోటీసులు పంపడంతో పాటు నిర్మాణం వెలుపల నోటీసులు అంటించాలని తెలిపింది.

ఆ నిర్మాణాన్ని ఎందుకు కూల్చేస్తున్నదీ స్పష్టమైన కారణం తెలపాలని సుప్రీంకోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. కూల్చివేతను వీడియో తీయాలని ఆదేశించింది. ఆదేశాలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది. రాజ్యాంగ పరిరక్షణకు పౌర హక్కుల పరిరక్షణ చాలా అవసరమని పేర్కొన్న జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం.. ఏకపక్ష చర్యకు వ్యతిరేకంగా చట్ట నియమాలు తప్పనిసరని, చట్టపరమైన ప్రక్రియ అటువంటి చర్యను క్షమించదని స్పష్టం చేసింది.

కార్యనిర్వహణ అధికారే న్యాయమూర్తి పాత్ర పోషించి చట్టాన్ని పాటించకుండా ఇంటి కూల్చివేతకు ఆదేశాలిస్తే అది రూల్ ఆఫ్ లాను ఉల్లంఘించడమే అవుతుందని పేర్కొంది. కూల్చివేతలకు సంబంధించి సంబంధిత వెబ్‌సైట్‌లో నోటీసులను ప్రదర్శించాలని ఆదేశాలు జారీచేసింది. అలాగే, నోటీసులను తప్పకుండా రిజిస్టర్డ్ పోస్టులోనే పంపాలని పేర్కొంది.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*