
అరండల్ పేట స్టేషన్లో మైనర్ ఎవరు?
అర్దరాత్రి మైనర్లను స్టేషన్లో కి అనుమతించిన పోలీసులపై చర్యలేవి?
డీఎస్పిపై చర్యలు తీసుకోకుండా ఎస్పీ, ఐజి లు ఏం చేస్తున్నట్లు?
గుంటూరు జిల్లాలో అరండల్ పేట పోలీస్ స్టేషన్ కు బోరుగడ్డ అనిల్ వ్యవహారంతో ఒక ప్రత్యేకత సంతరించుకుంది. ఈ స్టేషన్ నుంచి బయటపడిన సిసి ఫుటేజ్ క్లిప్పుల ద్వారా అరండల్ పేట పోలీసులు అధికార దుర్వినియోగానికి ఏ విధంగా పాల్పడ్డారో తేటతెల్లమవుతుంది. చట్ట ప్రకారం మైనర్లు పోలీస్ స్టేషన్కు రాకూడదు, ఒకవేళ ఎవరైనా మైనర్లు క్రైమ్ లో భాగస్వామ్య అయితే వారిని చట్ట ప్రకారం,నియమ నిబంధనలకు లోబడి విచారించాల్సి ఉంటుంది. కానీ ఏ నేరంతో సంబంధంలేని ఓ మైనర్ బాలుడు అర్ధరాత్రి వేళ అరండల్ పేట పోలీస్ స్టేషన్ లో సంచరించడమే కాక పోలీసుల సాక్షిగా లోనికి ప్రవేశించి తన మేనమామతో పిచ్చాపాటి కబుర్లు చెప్పుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది,అంతేకాక ఇది పోలీసుల వైఫల్యానికి నిలువుటద్దంగా నిలిచింది. క్రమశిక్షణకు మారుపేరు పోలీసు శాఖ అని చెప్పుకునే పోలీసు ఉన్నతాధికారులకు ఈ వీడియో క్లిప్ చెంపపెట్టులా మారింది. సుమారు 10 గంటల ప్రాంతంలో ఆ బాలుడు పోలీసు సాక్షిగా లోనికి ప్రవేశించి వివిధ కేసుల్లో నిందితుడిగా ఉన్న బోరుగడ్డ అనిల్ తో మాట్లాడడానికి పోలీసులు ఎలా అనుమతించారు? కోర్టు అనుమతిని పొందారా? లేదా? అన్నది ఇక్కడ డాలర్ల ప్రశ్నగా మిగిలింది. పోలీసు కస్టడీలో విచారణకు ఉన్న నిందితుడిని ఎలా కలవనిచ్చారు? ఎలా మాట్లాడనిచ్చారు? అన్నది ఇక్కడ అర్థం కాని ప్రశ్న. ఇందుకోసం స్టేషన్ హౌస్ ఆఫీసర్ కొంత మొత్తాన్ని అందుకున్నట్లు తెలుస్తోంది. పేరు మోసిన రౌడీ షీటర్, వైసీపీ కార్యకర్త విచారణలో ఉన్న నిందితుడిని అంత సులువుగా సామాన్య పోలీసు కలిసే ఏర్పాట్లు చేయలేరని ఉన్నతాధికారుల హస్తం తప్పనిసరిగా ఉన్నదనే వాదన బలంగా వినిపిస్తోంది. ఈ విషయం అంతా స్టేషన్ హౌస్ ఆఫీసర్ కి తెలియకుండా జరిగి ఉండదని, డివిజనల్ స్థాయి అధికారి ప్రమేయంతోనే ఇవన్నీ జరిగి ఉండవచ్చన్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇటీవల కాలంలో రాయలసీమ నుంచి గుంటూరుకు బదిలీపై వచ్చిన ఓ అధికారి వైసిపి పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్సీ సహాయ సహకారంతో నగరంలోని లా అండ్ ఆర్డర్ అధికారులను గుప్పిట్లో పెట్టుకుని ఇలాంటి తతంగాలకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఒక రౌడీ షీటర్ కు రాచమర్యాదలు చేస్తున్నారన్న సంగతి తెలిసినా సదరు స్టేషన్ డివిజనల్ అధికారి మిన్నకుండటంపై సర్వత్ర విమర్శలు వెలుగుతున్నాయి. ఇంత తతంగం జరుగుతున్న ప్రతి స్టేషన్ లో విధులు నిర్వహించే స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అసలు ఉన్నారా? నిద్రపోతున్నారా? గాఢ నిద్రలో ఉన్నారా? అన్నది అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ స్టేషన్ లో విచిత్రం ఏమిటంటే నిజాన్ని నిర్భయంగా చెప్పే పత్రిక విలేకరులను టార్గెట్ చేస్తూ కేసులు బనాయించి భయపెట్టే ప్రయత్నాలు చేయడం కనిపిస్తుంది. తాము చేసిన తప్పుడు పనులను బాహ్య ప్రపంచానికి తెలియజెప్పేందుకు తనలో దాచుకున్న కొన్ని సంఘటనలను బయటపెట్టిన సిసి కెమరాల పుట్టేజీ ,సీసీ కెమెరాలు లోపల ఏమి జరిగింది జరుగుతుంది అన్న విషయాన్ని బాహ్య ప్రపంచానికి బహిర్గతం చేసింది. పోలీసులు ఏది చేసినా కరెక్టే అన్న వాదనను బయటకు తీసుకొచ్చి తాము అనుకున్నదే చేస్తామనే భావనను కలిగించే విధంగా ఈ పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. తాము వెలగబెట్టిన కార్యాలను బయటకు పొక్కకూడదన్న భావనతో ఉన్న పోలీసులు ప్రజలకు వాస్తవాలను తెలియచెప్పే పత్రిక ప్రతినిధులను బెదిరించడం అంత మంచిది కాదన్న భావన నగర ప్రజలలో వినిపిస్తోంది. ఈ పోలీసులు సుప్రీంకోర్టు తీర్పులను సైతం పక్కనపెట్టి తమ పనులను తాము అక్రమంగా చేసుకుంటూ పోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇంటా బయటా పోలీసుల తీరును ఎండగట్టే పరిస్థితికి దారి తీసిన సంఘటనల పట్ల ఎస్పీ,ఐజీలు ఏం చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది.ఏదేమైనప్పటికీ ఏపీలోని గుంటూరు నగరంలోనీ పోలీసు పనితీరు ప్రజలను ఆలోచింపజేస్తోందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
Be the first to comment