చైనా మరోసారి భారత్‌తో కయ్యానికి కాలు దువ్వుతోంది

చైనా మరోసారి భారత్‌తో కయ్యానికి కాలు దువ్వుతోంది. తాజాగా సరిహద్దులో రెండు పెద్ద గ్రామాలను నిర్మించింది. వాటిలో ఒకటి అక్సాయ్‌ చిన్‌లో భారత భూభాగాన్ని ఆక్రమించిన ప్రాంతంలో నిర్మించింది. భారత సరిహద్దుల్లో చైనా కొత్తగా హియాన్‌, హెకాంగ్‌ అనే రెండు కొత్త గ్రామాలను నిర్మించినట్టు చైనా ప్రభుత్వ అధికార వార్తాసంస్థ జిన్హువా వారం క్రితం ప్రచురించింది. ఈ గ్రామాల పరిపాలన కేంద్రాల్లో నిర్మించిన టౌన్‌షి్‌పలకు హాంగ్లీయూ, సెయిడుల అనే పేర్లు పెట్టారు. అక్సాయ్‌చిన్‌లో నిర్మించిన గ్రామం పేరు హియాన్‌. తాజా పరిణామం భారత ప్రభుత్వం దృష్టికి కూడా వచ్చింది. అయితే, ఇప్పటి వరకు దీనిపై భారత్‌ అధికారికంగా స్పందించలేదు. కాగా, సరిహద్దు వివాదం పరిష్కారానికి ఇరుదేశాల మధ్య కొనసాగుతున్న ద్వైపాక్షిక చర్చలపై చైనా ఏకపక్షంగా చేస్తున్న ఇటువంటి చర్యలు ప్రభావం చూపబోదని భారత ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు, ప్రపంచంలోనే అతిపెద్ద టిబెటన్‌ బౌద్ధుల స్టడీ సెంటర్‌ ‘లరుంగ్‌ గర్‌ బుద్ధిస్ట్‌ అకాడమీ’ వద్ద సుమారు 400 దళాలను, అనేక హెలికాప్టర్లను చైనా మోహరించింది. మతపరమైన కార్యకలాపాలపై గట్టి నిఘా కోసమే ఈ మోహరింపులు చేపట్టినట్టు సీటీఏ(సెంట్రల్‌ టిబెటన్‌ అడ్మినిస్ర్టేషన్‌) శుక్రవారం తెలిపింది. అలాగే, సెర్థార్‌ ప్రాంతంలోని బౌద్ధ మఠం వద్ద వచ్చే ఏడాది కఠిన నిబంధనల అమలుకు చైనా ప్రణాళికలు రూపొందించింది. ఇప్పటికే అక్కడున్న చైనా విద్యార్థులను ఆ ప్రాంతం వదిలి వెళ్లాలని ఆదేశించింది. 1950లో టిబెట్‌ను చైనా ఆక్రమించింది.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*