
మోడీ అభివృద్ధి వ్యూహం
భారత భావి ప్రధానిగా నరేంద్రమోడీని తెరమీదకు తీసుకురావటమన్నది ఆర్థిక వ్యూహంయొక్క రాజకీయ పతాక సన్నివేశం. ఈ పతాక సన్నివేశాన్ని భారతదేశం లోని అన్నిబూర్జువా శ్రేణులు ఆమోదిస్తున్నాయి. ఇది ఆర్థిక వ్యూహ రాజకీయ స్థాయిలో ప్రతిబింబించిన తార్కిక పర్యవసానం.
*మోడీ’అభివృద్ధి నమూన’ సారం
కార్పొరేట్ ఫైనాన్సియల్ వర్గం ప్రయోజనాల కోసం రాజ్యాన్ని ఉపయోగించటం ఈ అభివృద్ధి నమూనా సారం (ఇందుకనే ఆర్ధిక క్షేత్రం నుండి రాజ్యాన్ని పూర్తిగా తప్పించే నయా ఉదార వాదం భావనను దీనికి ఆపాదిస్తే అపభ్రంశమవుతుంది). ఈ వ్యూహం అభివృద్ధి, పరిపక్వత, పరిణతి అంతా కార్పొరేట్ ఫైనాన్సియల్ వర్గం రాజ్యాధికారాన్ని కబళించటంలోనే ఉంటుంది. నరేంద్రమోడీ ఈ ప్రక్రియ సజావుగా సాగటానికి ఉపయోగపడే ఉత్ప్రేరకం. ఈయన బిజెపి పాదులో పుట్టుకు వచ్చిన వాడు. ఇతని ఫాసిజం రికార్డు చాలా క్రమబద్దంగా ఉన్నది. అన్నింటికీ మించి కార్పొరేట్లకు ఇతనో దళారి. అందుకే కార్పొరేట్లు, వారి మీడియా మోడీని ఆకాశానికి ఎత్తి పొగడ్తలతో ముంచెత్తుతుంటారు.
మోడీ ‘అభివృద్ధి నమూన’ అంటే తను నడుపుతున్న రాజ్యాన్ని కార్పొరేట్ ఫైనాన్స్ వర్గాలకు అప్పజెప్పటమే. హిందూ దిన పత్రిక ననుసరించి నానో ప్యాక్టరీని గుజరాత్కు తరలించటం కోసం టాటాలకి 31,000 కోట్ల రూపాయల రాయితీలను మోడీ ఇవ్వటం జరిగింది. ప్రజలను విస్మరించటం ఈ ‘అభివృద్ధి నమూన’ స్వభావం. అభివృద్ధి నమూనా అంటే గుజరాత్తో అని డబ్బా కొట్టుకునే రాష్ట్రం మానవాభివృద్దిలో అధమ స్థాయి రాష్ట్రాల సరసన ఉండటంలో ఆశ్చర్యం ఏమీలేదు. కార్మిక సంఘాలపై దాడులు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి. అత్యంత అభివృద్ధి నిరోధక, ప్రజావ్యతిరేక ఆర్ధికాభివృద్ధి నమూనా యొక్క రాజకీయ వ్యక్తీకరణ ఏమంటే, కార్పొరేట్ ఫైనాన్స్ వర్గం రాజ్యాన్ని తన గుప్పెట్లోకి తీసుకుని ప్రజలకు వ్యతిరేకంగా దానిని ఉపయోగించటం. కార్పొరేట్ శక్తుల సహకారంతో మోడీ నాయకత్వం వహిస్తాడని చెప్తున్న రాజ్యం ప్రజావ్యతిరేక ఫాసిస్టు రాజ్యంతప్ప మరొకటి కాబోదు. ఈ ఆర్థికాభివృద్ధి నమూనా మోడీ తయారు చేసిన కషాయం కాదు. అది అన్ని బూర్జువా పార్టీల మద్దతున్న “నయా ఉదారవాద నమూన”. అయితే మోడీ ప్రత్యేకత ఏమిటంటే ఈ ఆర్థిక నమూనాని అత్యంత నిర్ధాక్షిణ్యంగా, గతంలో ఎవరూ చేయ సాహసించనంతగా అమలు చేయటం. ఇతర పార్టీల రాజకీయ నాయకులు వారివారి రాజకీయ పార్టీల భావజాల వారసత్వ సమస్యలతోనో లేక ఇతరులతో తమకున్న సంబంధాలలోని సంక్లిష్టత వల్లనో సతమతమవుతుంటారు. ఉదాహరణకు మన్మోహన్ సింగ్ గ్రూపును తీసుకుంటే ఆది కాంగ్రెసు పార్టీలో ఉండి పనిచేయాలి. ఆమ్ ఆద్మీ పేరుతో అది చేస్తా ఇది చేస్తా అనే వాగ్దానాలకు సంబంధించిన ప్రతిబంధకాలు దానికి ఉండనే ఉంటాయి. కానీ మోడీకి అలాంటి ప్రతిబంధకాలు ఏవీ లేవు. అతను తన పార్టీనిమించి ఎదిగి దానిని ఒక రబ్బరు స్టాంపుగా మార్చాడు. దాంతో అన్నీ తానై అత్యంత ఏకాగ్రతతో కార్పొరేట్ ఫైనాన్సియల్ ఎజెండాని ముందుకు తీసుకుని పొగలడు.
మరింత నయా ఉదారవాదం కోసం వైఫల్యాన్ని కూడా వాదనగా మార్చటం జరిగింది. వైఫల్యాన్నే వాదనగా చేసి మరింత తీవ్రంగా అమలులోకి తీసుకు రావటం ఈ అభివృద్ధి నమూనాకి గుర్తు. రూపాయి విలువ దిగజారుతున్నా, గతంలో ఎన్నడూ లేనంతగా పారిశ్రామిక రంగ ఉత్పత్తి పడిపోయినా (1960ల మధ్యలో వచ్చిన పారిశ్రామిక మందగమనంతో దీనికి కొంచెం సారూప్యత ఉన్నప్పటికీ అప్పటి సంక్షోభం అనూహ్యంగా వ్యవసాయ రంగంలో వరసగా రెండు సంవత్సరాల పాటు వచ్చిన కరవు ఫలితం), కరెంట్ ఖాతా లోటు రోజురోజుకూ దిగజారుతున్నా, అందరూ కోరస్తో పాడే పాట ఒకటే: మనకు సంస్కరణలు కావాలి (దీనర్థం నయా ఉదారవాద మోతాదు మరింతగా పెంచాలని).
దేశ ఆర్ధిక సమస్యలకు కారణం పారిశ్రామిక వేత్తలలో ‘పశు ప్రవృత్తి’ (యానిమల్ స్పిరిట్స్) తగ్గిపోతున్నాయి, వాటిని ప్రభుత్వ విధానం ద్వారా రగుల్కొల్పాలని మన్ మోహన్ సింగ్ అన్నది నిజంకాదా? వేరే విధంగా చెప్పాలంటే, నయా ఉదార వాదంతో వచ్చిన సంక్షోభాన్ని అధిగమించాలంటే రాజ్య ప్రమేయంతో మరింతగా నయా ఉ దారవాదాన్ని రుద్దాలి.
‘పశు ప్రవృత్తి’ అనే పదబందాన్ని జాన్ మేనార్డ్ కీన్స్ వాడిన విధంగా మన్ మోహన్ సింగ్ వాడలేదు. కీన్స్ ప్రకారం పారిశ్రామిక వేత్తలలో ‘పశు ప్రవృత్తి’ (యానిమల్ స్పిరిట్స్) అప్పుడప్పుడు తగ్గిపోతుంటాయి. ప్రజా ప్రయోజనాలను కాపాడేందుకు రాజ్య ప్రమేయం ద్వారా సంపూర్ణ ఉద్యోగ కల్పనకు అవసరమయిన విధానాలను ఆచరించి ప్రజల భవితను పారిశ్రామిక వేత్తల పశు ప్రవృత్తిపై ఆధారపడకుండా చూడాలి. దీనికి బదులు మన్ మోహన్ సింగ్ చెప్పేదేమంటే పారిశ్రామిక వేత్తలలో ‘పశు ప్రవృత్తి ‘ తగ్గిపోతుంటే కార్పొరేట్ పైనాన్సియల్ వర్గ ప్రయోజనాలకోసం మాత్రమే వాటిని ప్రభుత్వ విధానాలతో రగుత్కోల్పాలి.
వొడాటపోన్ లాంటి సంస్థలు పన్ను బాకీలు కట్టక పోయినా పట్టించు కోకూడదు. వాల్మార్ట్ంటి కంపెనీలను మల్టీ బ్రాండ్ చిల్లర వర్తకం చేసుకోవటానికి అనుమతించాలి. ప్రభుత్వ రంగ సంస్థ లను మరింతగా ప్రయివేటీకరించాలి. పైనాన్స్ రంగాన్ని విదేశీ శక్తుల ప్రవేశం కోసం మరింతగా తెరవాలి. అభివృద్ధి బ్యాంకింగ్ను అంతం చేయాలి. ఇలాంటి చర్యలెన్నో ఉన్నాయి.
తాను సృష్టించిన సంక్షోభాన్ని అధిగమించేందుకు నయా ఉదార వాదం మరింత తీవ్ర స్థాయిలో నయా ఉదారవాదాన్ని స్వీకరించాలనే భావనే దీనికి కారణం. ఆర్ధిక వ్యవస్థను సంక్షోభం ఆవహించినప్పుడు రాజ్యంపై కార్పొరేట్ నియంత్రణ పెరగాలనే డిమాండ్ భరింప శక్యంకాని స్థాయిలో ఉంటుంది. ప్రస్తుత పరిస్థితి అదే.
*సంప్రదాయ ఫాసిజంతో వున్న తేడా
1930 లలో బీభత్సం సృష్టించిన సంప్రదాయ ఫాసిజంకు నేడున్న దానికీ ఇక్కడే తేడా ఉన్నది. అప్పట్లో రాజ్యం మీద కార్పొరేట్ పెత్తనం దొడ్డి దారిలో వచ్చింది. ప్రజలలో ఉన్న పెట్టుబడిదారీ వర్గ వ్యతిరేక మనస్థితిని సొమ్ము చేసుకుని కార్పొరేట్ పెట్టుబడి ధన సహాయం తీసుకుని అధికారంలోకి వచ్చిన కొన్ని శక్తుల ద్వారా ఇది జరిగింది. ప్రారంభంలో ఆ శక్తులు మితవాద రాడికల్ (రైట్ రాడికల్) దృక్పథంతో కార్పొరేట్ పెట్టుబడికి తమ వ్యతిరేకతను ప్రకటించాయి. అధికారంలోకి వచ్చిన తరువాతనే ఈ శక్తులు తమ మితవాద రాడికల్ అనుయాయులను తమ పార్టీనుండి ప్రక్షాళన చేసి గుత్త సంస్థలతో తమకున్న సన్నిహిత సంబంధాన్ని బహిర్గతం చేశారు.
అయితే ఆ కాలం సామ్రాజ్యవాదుల మధ్య ఘర్షణవున్న కాలం. సరకులు, పెట్టుబడి ఎటువంటి ఆంక్షలు లేకుండా దేశదేశాల ఎల్లలు దాటుతున్న నేటి “ప్రపంచీకరణ” కాలం కాదు. ఆ కాలంలో పరస్పర వ్యతిరేక సామ్రాజ్యవాద దేశాల కూటములు ప్రపంచాన్ని తమతమ ప్రాబల్య క్షేత్రాలుగా పంచుకున్నాయి. ఎదుగుతున్న ఫాసిస్టు శక్తులు ప్రారంభంలో కార్పొరేట్ పెట్టుబడికి తమ వ్యతిరేకతను ప్రకటించి ఆ తరువాత గుత్త సంస్థలతో కూటమిగా ఏర్పడటం అనే రెండంచుల ప్రక్రియ నేటి ప్రపంచీకరణ యుగంలో సాధ్యపడదు. ఎదిగే ఏ రాజకీయ శక్తి అయినా గుత్త పెట్టు బడికీ, ద్రవ్య పెట్టుబడికీ ఏమాత్రం వ్యతిరేకంగా వున్నా పెట్టుబడి పెద్ద మొత్తంలో బయటకు వెళుతుంది. ఆవిధంగా రాజకీయ శక్తి ఎదుగుదలను పెట్టుబడి దెబ్బతీస్తుంది. కాబట్టి సంక్షోభ ప్రభావంతో క్షోభకు గురవుతున్న ప్రజలకు చెప్పేది గుత్త పెట్టుబడిదారులతో పోరాడి సంక్షోభాన్ని అధిగమిస్తామని కాదు. వారి ‘అభివృద్దినమూనా’ బండారాన్ని బయటపెడతామనీ కాదు. వారిని సంతృప్తి పరచి వారి ‘అభివృద్ధి నమూనా’ ను మరింత తీవ్రంగా ముందుకు తీసుకు పోతామనే నిశ్చయంతో రాజకీయ శక్తులుంటాయి.
మోడీ చెప్పేదిదే. ఇప్పటికిప్పుడే ముందుకు తీసుకు రాకపోయినప్పటికీ ఆయనకు జనామోదాన్నిచ్చే (మాస్ అప్పీల్) మతతత్వ ఫాసిజం ఉండనే ఉన్నది. అధికారం లోకి రావటానికి ఈ జనామోదం పెట్టుబడిదారీ వర్గ వ్యతిరేక ప్రకటనలతో మిళితమయి ఉ ండదు. పైగా కార్పొరేట్ ద్రవ్య పెట్టుబడిదారీ వర్గం కోరుకున్న అభివృద్ధి నమూనాతో మిళితమయి దాని గురించి లేనిపోని గొప్పలు చెప్పే పనిలో ఉంటుంది. 1930 లలోని యూరోపియన్ ఫాసిస్టులు ద్రవ్య పెట్టుబడి చేతుల్లో పనిముట్లుగా మారారు. మోడీ ఆదినుండీ ద్రవ్య పెట్టుబడి తొత్తే.
ఇతర బూర్జువా పార్టీలలోని మోడీ వ్యతిరేకులు మోడీ మీద చేసే విమర్శలు ఈ కారణం చేతనే బలహీనంగా ఉంటున్నాయి. దీనికి కారణం ఆర్ధిక విధానం గురించిన మౌలిక విషయాలపట్ల వీరందరి అవగాహనే మోడీ అవగాహన. కాకపోతే మోడీకి వీరందరి కంటే దూకుడెక్కువ. బూర్జువా పార్టీలు మోడీ అభివృద్ధి నమూనాని లోలోపల మెచ్చుకుంటాయి. ఈ నమూనాను వారు కూడా మెచ్చుకోవటమే కాకుండా వీలయితే దానిని పూర్తి స్థాయిలో అనుసరించాలని వారి ఆలోచన. మోడీ అభివృద్ధి నమూనాని కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన స్వయంప్రకటిత ఉదారవాది ప్రొపెసర్ జగదీష్ భగవతి సఫలమైనదిగా పేర్కొనటంలో ఆశ్చర్యం ఏమీ లేదు. స్వేచ్చ ఉంటే నిజానికి మన్మోహన్ సింగ్ కూడా యిదే చేసి ఉండేవాడు.
*పనికిమాలిన తేడా
ఇతర బూర్జువా పార్టీలలో ఉన్న మోడీ వ్యతిరేకులు చెయ్యగలిగేదేమంటే మతతత్వ ఫాసిస్టు మోడీకీ, ‘అభివృద్ధి కాముక’ మోడీకీ మధ్య తేడాలు వెతకటం. అవును, మోడీ అభివృద్ధి చేయటంలో దిట్ట అయితే కావచ్చుగాక, కాని, ఆయన మతతత్వవాది కాదా? అని వారు ప్రశ్నిస్తారు. మొదటి విషయం ఎంత గొప్పదయినా రెండవ కారణం చేత ఆయన అధికారం బయటే ఉండాలి.
కానీ అలాంటి వ్యత్యాసాలకు విశ్వసనీయత ఉండదు. గుజరాత్ మారణ హెూమాన్ని మరిపింప జేయటానికి మోడీ తన ప్రత్యర్ధులు కూడా మెచ్చుకునే “అభివృద్ధి ప్రవక్త” అవతారం ఎత్తాడు. దీనితో తన సహజ మతతత్వ ఫాసిస్ట్ స్వభావాన్ని మరుగు పరచాలని భావించాడు. ఒక దశలో, ఆర్ఎస్ఎస్ జోక్యం చేసుకునే వరకూ, గుజరాత్ మారణకాండలో నిందితులైన మాయా కొద్నాని, బాబూ బజరంగిలకు ఉరిశిక్ష వెయ్యాలని కోర్టును అభ్యర్ధించాలని గుజరాత్ ప్రభుత్వం భావించింది.
మతతత్వ ఫాసిస్టు మోడీకీ, ‘అభివృద్ధి కాముక’ మోడీకీ మధ్య తేడా ఉందనటం అంతర్గతంగా కూడా పొసగదు. అధిక వృద్ధి రేటును కీర్తిస్తూ ఉండే మోడీ అభివృద్ధి భావనను అన్ని బూర్జువా రాజకీయ పార్టీలూ అంగీకరిస్తాయి. అధిక వృద్దిరేటుతో ప్రభుత్వ ఆదాయం పెరుగుతుందనీ తద్వారా పేద ప్రజల అభ్యున్నతికి చేసే ఖర్చును పెంచవచ్చనే వాదనలు అప్పుడప్పుడూ వినిపించినప్పటికీ అభివృద్ధిని వేగవంతం చేయటంద్వారా భారతదేశాన్ని ‘ఆర్థిక అగ్రరాజ్యం’ గా ఎదిగేలా చూడాలనే ఉద్దేశం ఉ న్నది. క్లుప్తంగా చెప్పాలంటే అగ్రరాజ్య దురహంకార భావన ప్రాదిపదికనే నయా ఉ దారవాద అభివృద్ధి నమూనాను సమర్దించటం జరుగుతోంది. సూటిగా చెప్పాలంటే ఈ ప్రాతిపదిక ఫాసిస్టు స్వభావాన్ని కలిగి ఉన్నదే. ప్రపంచంలోని బూర్జువా పార్టీలన్నీ ఫాసిస్టు సంభాషణల్లో (డిస్కోర్స్) పాల్గొంటుంటే ఒక నిజమైన మతతత్వ ఫాసిస్టు ఆవిర్భావానికి వ్యతిరేకంగా చేసే ప్రతిఘటన అత్యంత బలహీనంగా ఉండటంలో ఆశ్చర్యం ఏమీలేదు.
టూకీగా చెప్పాలంటే, మోడీ అభివృద్ధి నమూనాను సమర్ధించినంత కాలం మోడీని వ్యతిరేకించటం సాధ్యంకాదు. మతతత్వ ఫాసిస్టు మోడీకీ, ‘అభివృద్ధి ప్రవక’ మోడీకీ మధ్య తేడా ఉందనే ద్వంద్వ విచక్షణతో కర్కశంగా ముందుకెల్లే నయాఉ దారవాద అభివృద్ధి నమూనాను సమర్దిస్తూ మోడీని ఎదుర్కోలేము. ఎందుకంటే అభివృద్ధిని గురించిన ఈ ధోరణిలో ఫాసిజంకు సంబంధించిన నిర్మాణాలున్నాయి.
వీటన్నింటిలో మనకు తెలిసేదేమంటే ఉదారవాద మేథోపర దివాళాకోరుతనం. జాన్ మేనార్డ్ కీన్స్ ఉదారవాది. ఆయనకు చాలాచాలా ముందు జాన్ స్టూవర్ట్ మిల్ అనే ఉదారవాది (ఈయన జీవితంలో చివరి దశలో తన భార్య, హారియట్ టేలర్ ప్రభావంతో కోపరేటివ్ సోషలిస్టు గా మారాడు). జాన్ స్టూవర్ట్ మిల్ “నిశ్చల రాజ్యం” (ఆ రాజ్యంలో వృద్ది రేటు సున్నాగా ఉంటుంది) ఆవిర్భావాన్ని ఊహించాడు. అలాంటి “నిశ్చల రాజ్యం” లో కార్మికుల జీవితాలు బాగా ఉన్నంత వరకూ విచారపడవలసిన అవసరంలేదన్నాడు. మెరుగైన పంపకం మీదా, శ్రామిక వేతనాలు పెంచటం మీద జాతి తన దృష్టిని కేంద్రీకరించటం నిజమైన అవశ్యకత అని ఆయన అభిప్రాయపడ్డాడు.
ఒక్కమాటలో చెప్పాలంటే, ఉదారవాదం సంప్రదాయంగా కార్మికుల స్థితిగతుల గురించి పట్టించుకుంటుంది. కార్మికుల స్థితిగతులను ఎలా మెరుగుపరచాలనే విషయం మీదనే ఉదారవాదం సోషలిస్టులతో విభేదిస్తుంది. ఫాసిజం ప్రాతిపదికన వృద్ధిరేటే సర్వంగా భావించి, దానిని సాధించటం కోసం కష్టజీవులను పీల్చిపిప్పిచేసే నేటి ఉ దారవాదానికి నాటి ఉదారవాదానికి మధ్య పోలికే లేదు.*
_____________________________________
47 గుజరాత్ ఆర్థికాభివృద్ధి మార్గం
Be the first to comment