
తూత్తుకుడి ప్లాంట్‌కు సుప్రీం ‘నో’
వేదాంత రివ్యూ పిటిషన్ తిరస్కరణ
న్యూఢిల్లీ : వేదాంత కంపెనీకి చెందిన తూత్తుకుడి రాగి ప్లాంట్‌ను తిరిగి తెరిచేందుకు సుప్రీం కోర్టు నో చెప్పింది. కంపెనీని తిరిగి ప్రారంభించేందుకు ఆదేశాలు జారీ చేయడానికి తిరస్కరించింది. ఫిబ్రవరిలో ఇచ్చిన తీర్పును పున:పరిశీలించాల్సిందిగా కోరుతూ వేదాంత స్టెరిలైట్ పెట్టుకున్న రివ్యూ పిటిషన్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ఈ ప్లాంట్ వల్ల కాలుష్యం ఎక్కువవుతోందంటూ స్థానికులు సాగించిన సుదీర్ఘ పోరాటం ఫలితంగా ఆరేళ్ళ క్రితం ఈ ప్లాంట్ మూత పడింది. కేవలం పారిశ్రామిక ప్రయోజనాల కన్నా ఆరోగ్యం ముఖ్యమైన ప్రజా హక్కు అని సుప్రీం కోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. బహిరంగ కోర్టులో రివ్యూ పిటిషన్ కోసం పెట్టుకున్న దరఖాస్తును తిరస్కరించినట్లు త్రిసభ్య ధర్మాసనం అక్టోబరు 22న జారీ చేసిన ఆదేశాలను శనివారం ప్రచురించారు. ఈ నెల 10న పదవీ విరమణ చేసిన భారత ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ ఈ రివ్యూ పిటిషన్‌ను తోసిపుచ్చింది. తూత్తుకుడి ప్లాంట్‌ను శాశ్వతంగా మూసివేయాలని 2018లో తమిళనాడు ప్రభుత్వం, రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు తీసుకున్న నిర్ణయాలను 2020 ఆగస్టులో మద్రాసు హైకోర్టు ధ్రువీకరించింది. ఆ నిర్ణయాన్ని సుప్రీం కోర్టు ఫిబ్రవరిలో సమర్ధించింది. పరిశ్రమను మూసివేయాలన్నది ఎన్నడూ మొదటి ఎంపికగా వుండదని కోర్టు పేర్కొంది. అయితే దీర్ఘకాలంగా, పైగా పదే పదే తీవ్రమైన ఉల్లంఘనలకు వేదాంత పాల్పడినందున కంపెనీని మూసివేయాలని నిర్ణయించడం తప్ప హైకోర్టుకు మరో మార్గం లేకపోయిందని పేర్కొంది. మరే విధంగా చర్యలు తీసుకున్నా ప్రజల పట్ల అధికారులకు గల బాధ్యత, విధులను నిర్లక్ష్యం చేయడమే కాగలదని వ్యాఖ్యానించింది. ఈ ప్లాంట్ వల్ల ఆ ప్రాంతానికి ఆదాయం సమకూరిందని, పైగా ప్రజలకు ఉపాధి దొరికిందని, దేశానికి ఉత్పాదక ఆస్తులు ఒనగూడాయని ఈ వాస్తవాన్ని తాము గుర్తించామని కోర్టు పేర్కొంది. అయితే అదే సమయంలో సుస్థిర అభివృద్ధి, ప్రజా విశ్వాసం వంటి సూత్రాలను కూడా గమనంలోకి తీసుకోవాల్సి వుందని, చిట్టచివరగా కాలుష్య కారక సంస్థ మూల్యం చెల్లించక తప్పదని పేర్కొంది. ఆ ప్రాంత వాసుల ఆరోగ్యం, సంక్షేమం అన్నింటికంటే ముఖ్యంగా ఆందోళన కలిగించే అంశంగా వుందని పేర్కొంది. ప్రజల ఆందోళనలను పరిష్కరించే, వారి సంక్షేమాన్ని కాపాడే బాధ్యత అంతిమంగా ప్రభుత్వానిదేనని కోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. ప్లాంట్‌ను తిరిగి ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ ప్లాంట్‌ను అమ్మేసుకుని, మరెక్కడైనా వెళ్ళిపోవడమే వేదాంతకు గల అవకాశమని చెప్పింది. దాదాపు 30ఏళ్ళ పాటు స్థానికులు నిరసనలు, ఆందోళనలు కొనసాగించిన ఫలితమే 2018లో ప్లాంట్ మూతపడింది. ప్రజా నిరసనలపై పోలీసు కాల్పులు కూడా జరిగాయి.
Be the first to comment