
పరాధీనమైన దేవాదాయశాఖ భూముల విలువ ఇది
దేవాదాయశాఖ కొంతమందికి ఫారం-8 ఇవ్వడం, ఆలయాల్లో పని చేసినవారికి కేటాయించిన భూములు అమ్ముకోవడంతో అవి చేతులు మారిపోయాయి. 2016లో వచ్చిన చట్టం ప్రకారం ఆ శాఖ పరిధిలోని భూములను గుర్తించి నిషేధిత జాబితాలో చేర్చారు.
పరాధీనమైన దేవాదాయశాఖ భూముల విలువ ఇది..
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 26 ఆలయాల పరిధిలో ఆక్రమణలపాలైన భూమి 1,118.93 ఎకరాలు… దీని మార్కెట్ విలువ అక్షరాలారూ. 3,932.16 కోట్లు
తాజాగా ఆక్రమణల వివరాలు సేకరించిన దేవాదాయశాఖ ఆ భూములను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. కొన్నిచోట్ల ఆక్రమణదారుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కొంతమంది కోర్టులకెళ్తున్నారు.
ఈనాడు – అమరావతి: దేవాదాయశాఖ కొంతమందికి ఫారం-8 ఇవ్వడం, ఆలయాల్లో పని చేసినవారికి కేటాయించిన భూములు అమ్ముకోవడంతో అవి చేతులు మారిపోయాయి. 2016లో వచ్చిన చట్టం ప్రకారం ఆ శాఖ పరిధిలోని భూములను గుర్తించి నిషేధిత జాబితాలో చేర్చారు. దీంతో రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. ఇందులో కొన్ని కేసులు న్యాయస్థానాల్లో ఉన్నాయి. మరికొన్ని కేసులను దేవాదాయశాఖ గెలిచినా.. ఆ భూములను స్వాధీనం చేసుకోవడంలో జాప్యం జరుగుతోంది. గుంటూరు నగరంలోనే రూ. వందల కోట్ల విలువైన భూములు వివాదాస్పదంగా మారాయి. బృందంగా ఆక్రమించినవారి వివరాలను సేకరించిన దేవాదాయశాఖ వాటిని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఎప్పుడో కొనుగోలు చేశామని, ఇప్పుడు స్వాధీనం చేసుకుంటామంటే ఎలా? అని ఆక్రమణదారులు ఎదురుతిరుగుతున్నారు.
గుంటూరు నగరంలో గుజ్జనగుండ్ల ఆంజనేయస్వామి ఆలయానికి చెందిన 3,023 చదరపు గజాల స్థలాన్ని 28 మంది ఆక్రమించుకున్నట్టు దేవాదాయశాఖ అధికారులు గుర్తించారు. ఇక్కడా గజం విలువ రూ. లక్ష వరకు ఉంది. ఇప్పటికే అనేకమార్లు చేతులు మారాయి. ప్రస్తుతం రిజిస్ట్రేషన్లు జరగడం లేదు.
బాపట్లలోని శ్రీభావన్నారాయణస్వామి ఆలయానికి చెందిన 36.08 ఎకరాల వ్యవసాయ భూమిని 15 మంది ఆక్రమించుకున్నారు. ఇందులో 4.5 ఎకరాలు పట్టణంలో ఉంది. ఇక్కడ ఎకరం ఖరీదు రూ. 10 కోట్ల వరకు ఉంది. మిగిలిన భూమి విలువ ఎకరం రూ. 20 లక్షలపైమాటే. సోమేశ్వరస్వామి ఆలయానికి చెందిన 15.47 ఎకరాలను 16 మంది ఆక్రమించారు. ఇదీ ఎకరం ధర రూ. 20 లక్షలవరకు ఉంది.
పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం చెంఘిజ్‌ఖాన్‌పేటలో శ్రీవెన్నముద్ద గోపాలకృష్ణస్వామి ఆలయానికి చెందిన 15 ఎకరాల్లో 220 మంది ఆవాసాలు నిర్మించారు. ఇక్కడ ఎకరం రూ. కోటిపైగానే ఉంది.
1,119 ఎకరాలు.. రూ.3,932 కోట్లు
కొరిటెపాడులోని సీతారామాంజనేయ స్వామి ఆలయం
గుంటూరు నగర నడిబొడ్డున కొరిటెపాడు సీతారామస్వామి ఆలయానికి చెందిన 128.75 ఎకరాలను 1,500 మంది ఆక్రమించి నిర్మాణాలు చేశారు. ఆలయ అధికారులు కోర్టుకెళ్లగా కేసు పెండింగ్‌లో ఉంది. 2008 వరకు ఈ భూముల క్రయవిక్రయాలు నడిచాయి. ప్రస్తుతం ఇక్కడ ఎకరం ధర రూ. 20 కోట్లపైమాటే.
1,119 ఎకరాలు.. రూ.3,932 కోట్లు
పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని వేణుగోపాలస్వామి ఆలయానికి వడ్డపల్లి పరిసరాల్లో 103.51 ఎకరాలు వేర్వేరు సర్వే నంబర్లలో ఉన్నాయి. వీటిని 1,310 మంది ఆక్రమించుకున్నట్టు దేవాదాయశాఖ గుర్తించి గతంలోనే నోటీసులిచ్చింది. ఇక్కడ ఎకరా ఖరీదు రూ. 10 కోట్లపైగానే ఉంది.
1,119 ఎకరాలు.. రూ.3,932 కోట్లు
బాపట్ల జిల్లా అద్దంకిలో శ్రీకమటేశ్వరస్వామి ఆలయానికి ఉన్న 12.96 ఎకరాలను 200 మంది ఆక్రమించి ఇళ్లు నిర్మించుకున్నారు. ఇక్కడ ఎకరం విలువ రూ. 10 కోట్లకుపైగానే ఉంది.
1,119 ఎకరాలు.. రూ.3,932 కోట్లు
గుంటూరు నగరంలో అమరావతి రోడ్డులో అన్నదాత సమాజం కింద 2,398 చదరపు గజాలను 69 మంది ఆక్రమించుకున్నారు. వాణిజ్యఅవసరాలకు ఉపయోగించుకుంటుండడంతో చదరపు గజం రూ. 1.50 లక్షలకుపైగానే పలుకుతోంది.
స్వాధీనానికి ప్రయత్నిస్తున్నాం
– కేబీ శ్రీనివాసరావు, ఉపకమిషనర్, గుంటూరు జోన్
ఆలయాల భూములపై దశాబ్దాల కిందటే క్రయవిక్రయాలు జరిగాయి. ఇవన్నీ బృందాలుగా ఆక్రమించుకున్న భూములు, స్థలాలు. వీటిపై కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి. గెలిచిన కేసులకు సంబంధించి ఆక్రమణదారుల నుంచి భూములు స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం.
1,119 ఎకరాలు.. రూ.3,932 కోట్లు
Be the first to comment