
ఎరక్కపోయి.. ఇరుక్కుంటారా!
సామాజిక మాధ్యమాల్లో దురుద్దేశపూర్వకంగా, అసభ్యకర పోస్టులు పెడితే పోలీసులు 41ఎ నోటీసులిచ్చి పంపేస్తారన్న ధోరణి చాలామందిలో ఉంది. రెండు రోజుల క్రితం తాడేపల్లికి చెందిన వైకాపా సోషల్ మీడియా విభాగానికి చెందిన వెంకట్రామిరెడ్డికి గుంటూరు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.
అసభ్యకర పోస్టులు పెడితే కేసులే
భవిష్యత్తులో ఇబ్బందులే
వైకాపా ప్రాయోజిత ముఠాలతో బలైపోతున్న యువత
జిల్లాలో మూడు రోజుల్లో 23 కేసులు
ఎరక్కపోయి.. ఇరుక్కుంటారా!
సామాజిక మాధ్యమాల్లో దురుద్దేశపూర్వకంగా, అసభ్యకర పోస్టులు పెడితే పోలీసులు 41ఎ నోటీసులిచ్చి పంపేస్తారన్న ధోరణి చాలామందిలో ఉంది. రెండు రోజుల క్రితం తాడేపల్లికి చెందిన వైకాపా సోషల్ మీడియా విభాగానికి చెందిన వెంకట్రామిరెడ్డికి గుంటూరు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీన్ని బట్టి ఈ కేసులను కోర్టులు చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాయన్నది గమనార్హం.
అమరావతి
వైకాపా ప్రాయోజిత ముఠాలు సోషల్‌మీడియాలో రెచ్చిపోతున్న సంగతి తెలిసిందే. కన్నూమిన్నూ కానక.. ఉచ్ఛనీచాలు మరచి.. అవతలి వ్యక్తులను ఇష్టానుసారం తిడుతూ.. మార్ఫింగ్ ఫొటోలు పెడుతూ.. పైశాచిక ఆనందం పొందుతున్నాయి. వాట్సాప్, ఫేస్‌బుక్, ఎక్స్ వంటివాటితోపాటు న్యూస్ వెబ్‌సైట్లు, వివిధ యూట్యూబ్ ఛానళ్లల్లో సైతం అందులోని అంశాలతో సంబంధం లేకుండా వైకాపా ముఠాలు విషం చిమ్ముతూ అసభ్యకర పదజాలంతో కామెంట్లు పెడుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, మంత్రి లోకేశ్ సహా ప్రభుత్వంలోని ప్రముఖులు, వారి కుటుంబ సభ్యులే లక్ష్యంగా దూషణలతో దాడి చేస్తున్నాయి. ఈ వైకాపా ప్రాయోజిత ముఠాల్లో అత్యధికులు యువకులే. డబ్బుకు ప్రలోభపడో.. తాయిలాలకు ఆశపడో చట్టవిరుద్ధమైన పనులు చేస్తూ కేసుల్లో ఇరుక్కుంటున్నారు. ఇది వారి భవిష్యత్తును దెబ్బతీస్తుందన్న విషయాన్ని గుర్తెరగడం లేదు. ఇప్పటికే ఇలాంటి కేసుల్లో ఇరుక్కున్న యువకులు విలవిల్లాడుతున్నారు. కేసుల కారణంగా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. ఇప్పటికే పోలీసులు కఠిన చర్యలకు దిగడంతో జిల్లా నుంచి చాలామంది పరారయ్యారు.
కేసులతో నష్టమిలా…
చదువులు, ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లేవారు పోలీసుల నుంచి తప్పనిసరిగా నిరభ్యంతర ధ్రువపత్రం (ఎన్‌వోసీ) తీసుకోవాలి. దీనికి దరఖాస్తు చేసినప్పుడు హిస్టరీ ప్రొఫైల్ తీస్తారు. కేసులుంటే మాత్రం ఎన్‌వోసీ ఇవ్వరు. ఇది లేకపోతే సదావకాశాలను కోల్పోయినట్టే.
ఒక్కసారి కేసు నమోదైందంటే ఆ వ్యక్తిపై నిఘా ఉంటుంది.
పిల్లల తల్లిదండ్రులకూ ఇబ్బందే. కేసులు నమోదైనప్పుడు పిల్లలు దొరక్కపోతే తల్లిదండ్రులను స్టేషన్‌కు తీసుకొచ్చి కూర్చోబెడతారు.
తెలిసో… తెలియకో… ఎవరో చెప్పారనో… డబ్బు ఆశ చూపించారనో… ఏ నాయకులో మభ్యపెట్టారనో.. ఎదుటివారిని అసభ్యకర పదజాలంతో దూషిస్తూ.. వారి కుటుంబ సభ్యులను అవమానిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినా.. లైక్‌లు కొట్టినా.. ఫార్వర్డ్ చేసినా.. అంతే సంగతులు. పోలీసు యంత్రాంగం చట్టపరమైన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే జిల్లాలోని 28 పోలీస్ స్టేషన్ల పరిధిలో 23 కేసులు నమోదయ్యాయి.
ఇలా చేయడం నేరం…
ఉద్దేశపూర్వకంగా.. దురుద్దేశంతో వ్యక్తిత్వ హననానికి పాల్పడకూడదు. ఇలాంటి సమాచారాన్ని ప్రజలకు చేరవేయకూడదు.
అసత్యాలు ప్రచారం చేయడం, ఎదుటి వ్యక్తుల కుటుంబాలనుద్దేశించి అసభ్యంగా దూషిస్తూ పోస్టులు పెట్టకూడదు. వీటికి లైక్‌లు కొట్టడం, ఇతరులకు పంపడం చేయకూడదు.
ప్రజల మధ్య విద్వేషాలు రగిలేలా పోస్టులు చేయకూడదు.
రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కొనడానికి వైకాపా సోషల్‌మీడియా విభాగం చేస్తున్న అరాచకాల్లో భాగమైతే జీవితం అంధకారమవుతుంది.
పోలీసులు ఏమంటున్నారంటే
అసభ్య పదజాలంతో పోస్టులు తయారు చేసి సోషల్ మీడియా ద్వారా ప్రజలకు చేరవేయడం వంటివి తీవ్ర నేరాల కిందకు వస్తాయి. దారుణమైన మార్ఫింగ్ చిత్రాలు/వీడియోలు తయారు చేసి వ్యాప్తి చేసినా కేసులు ఎదుర్కొనాల్సిందే. ఏవి పడితే అవి వైరల్ చేయకూడదు. ఒకవేళ ఎవరైనా మీ ఫోన్లకు అలాంటి జుగుప్సాకరమైన పోస్టులు, వీడియోలు, చిత్రాలు పంపితే సమీపంలోని పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి వారి సూచన మేరకు తొలగించాలి. ఇలాంటి సమాచార వ్యాప్తికి వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లే బాధ్యులు. విషపూరిత సమాచార మార్పిడి విషయాల్లో భాగస్వాములు కాకుండా పిల్లల్ని తల్లిదండ్రులు అప్రమత్తం చేయాలి. పదేపదే తప్పుడు పోస్టులు పెడితే రౌడీషీట్, సస్పెక్టు షీట్, సైబర్ బుల్లీస్ షీట్ తెరుస్తారు. ఇవి ఒకసారి పెడితే.. ఉపసంహరించడం అంత సులువు కాదు.
భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్), ఐటీ, సైబర్ నేరాల చట్టాలు ఏం చెబుతున్నాయంటే….
ఫేక్/మార్ఫింగ్ చిత్రాలు, వీడియోలు వ్యాప్తి చేసి.. అవతలి వ్యక్తుల వ్యక్తిత్వ హననానికి పాల్పడితే..
67 ఆఫ్ ఐటీ యాక్టు కింద కేసు.
నేరం రుజువైతే మూడేళ్ల జైలు శిక్ష
రూ.5 లక్షలు జరిమానా.
ప్రముఖ వ్యక్తుల పేర్లతో (ఇంపర్షన్) పోస్టులు పెట్టి వ్యాప్తి చేస్తే….
66డి ఆఫ్ ఐటీ యాక్టు కేసు
మూడేళ్ల జైలుశిక్ష
జరిమనా రూ. లక్ష
జగుప్సాకరంగా ఉన్న చిత్రాలు, వీడియోలు ఆన్‌లైన్‌లో వ్యాప్తి చేస్తే…
ఎలక్ట్రానిక్స్ ఎవిడెన్స్‌గా పరిగణించి బీఎన్‌ఎస్ చట్టంలోని 353 (2) సెక్షన్ కింద కేసు
అసభ్యకర పోస్టులు తయారు చేసి పెడితే…
67ఎ ఆఫ్ ఐటీ యాక్టు కింద కేసు.
ఐదేళ్ల జైలు శిక్ష…
రూ. 10 లక్షల జరిమానా.
తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి ఒక వ్యక్తి పరువుకు భంగం కలిగిస్తే
బీఎన్‌ఎస్ చట్టంలోని 336(4) సెక్షన్ కింద కేసు.
సమాజంలో సంఘాలు, సమూహాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు పెడితే…
బీఎన్‌ఎస్ చట్టంలోని 356(2) సెక్షన్‌తోపాటు పరువు నష్టం కింద కేసులు.
Be the first to comment