గూగుల్‌ను గుడ్డిగా నమ్మితే.. మీకూ ఇలాంటి మోసమే జరగొచ్చు!

ప్రస్తుతం ఏది కావాలన్నా గూగుల్‌లోనే వెతికేస్తున్నాం. అయితే అందులో వచ్చిన ప్రతి సమాచారాన్ని గుడ్డిగా నమ్మి ముందుకు వెళ్తే మోసపోయే అవకాశం ఉంది. ఇలాగే పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ వ్యక్తి కర్ణాటకలోని ఉడిపిలో క్యాబ్ బుక్ చేసుకునే ప్రయత్నంలో ఆన్‌లైన్ మోసానికి గురై రూ.4.1 లక్షలు పోగొట్టుకున్నాడు.

గూగుల్ సెర్చ్‌లో కనిపించిన మోసపూరిత కార్ రెంటల్ వెబ్‌సైట్‌తో లింక్ అయిన నకిలీ చెల్లింపు పేజీలో తన కార్డ్ వివరాలను నమోదు చేసి బాధితుడు మోసపోయినట్లు తెలుస్తోంది. ఓ వార్తా నివేదిక ప్రకారం.. ఆ వ్యక్తి కార్ రెంటల్ సర్వీస్‌ల కోసం గూగుల్‌లో శోధించాడు. “శక్తి కార్ రెంటల్స్” అని కనిపించిన లింక్‌పై క్లిక్ చేశాడు. కొద్దిసేపటికే కంపెనీ ప్రతినిధినంటూ ఒక వ్యక్తి అతన్ని సంప్రదించాడు. అతను వెబ్‌సైట్ ద్వారా టోకెన్‌గా రూ. 150 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించమని సూచించాడు.

దీంతో బాధితుడు తన డెబిట్, క్రెడిట్ కార్డ్‌లతో ఫీజు చెల్లించడానికి ప్రయత్నించాడు. అయితే ఎంత ప్రయత్నించినా లావాదేవీ పూర్తి చేయడానికి అవసరమైన ఓటీపీ రాలేదు. కానీ, కొద్దిసేపటికే అతని ఖాతాల నుండి డబ్బులు కట్‌ అయినట్లు బ్యాంక్ నుంచి నోటిఫికేషన్‌లు వచ్చాయి. తన ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డు నుంచి రూ.3.3 లక్షలు, కెనరా బ్యాంక్‌ డెబిట్‌ కార్డు నుంచి రూ.80,056 మొత్తం రూ.4.1 లక్షలు కట్‌ అయ్యాయి.

దేనికోసమైనా గూగుల్‌లో వెతికేటప్పుడు అందులో వచ్చే లింక్‌లను ఒకటికి రెండుసార్లు ధ్రువీకరించుకుని ముందుకెళ్లాలి. ఆర్థిక విషయాలకు సంబంధించినవైతే మరింత జాగ్రత్త అవసరం. మరోవైపు గూగుల్‌ కూడా ఇలాంటి మోసాలను అరికట్టడానికి ఒక కొత్త అల్గారిథమ్‌ను అభివృద్ధి చేసినట్లు కొన్ని నెలల క్రితం తెలిపింది.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*