
ఈనాం భూముల సమస్యలు పరిష్కరిస్తే 5 లక్షల కుటుంబాలకు లబ్ధి. మాజీ మంత్రి ప్రత్తిపాటి.
రాజుల, జమీందార్ల కాలంనాడు అర్చకులకు, రజకులకు, భజంత్రీలకు, కళాకారులకు ఇచ్చిన సర్వీస్ ఈనాం భూముల భూములను 22a.1.c కింద నిషిద్ధ జాబితాలో నమోదు చేయడంతో ఆ భూముల యజమానులు పలు సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు మాజీ మంత్రి, చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. అసెంబ్లీలో జీరో అవర్ లో మాట్లాడిన ప్రత్తిపాటి ఈ సమస్య చిలకలూరిపేట నియోజకవర్గంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉందని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు.
ఈ భూములను నిషిద్ధ జాబితాలో చేర్చడం వల్ల రిజిస్ట్రేషన్ కాక, క్రయ విక్రయాలు చేసుకోలేక, బ్యాంకుల్లో రుణాలు లభించక ఆ భూముల యజమానులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. ఇలాంటి భూములు ఒక్క చిలకలూరిపేట నియోజకవర్గంలోనే 1700 ఎకరాల వరకూ ఉండగా, రాష్ట్రవ్యాప్తంగా 25 వేల ఎకరాల వరకూ ఉన్నాయన్నారు. చట్ట సవరణ ప్రక్రియ పూర్తి చేసి వీటిని నిషిద్ధ జాబితా నుంచి తొలగిస్తే దాదాపు 5 లక్షల పేద కుటుంబలకు లబ్ధి కలుగుతుందని ప్రత్తిపాటి చెప్పారు. 2018 లోనే తాను ఈ సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారి దృష్టికి తీసుకురాగా, ఆయన స్పందించి దానిపై ఒక ఆర్డినెన్సు కూడా జారీ చేయించారని, అయితే ఈ భూములు కేంద్ర, రాష్ట్ర ఉమ్మడి జాబితాలో ఉన్నందున చట్ట సవరణ కోసం బిల్లును రాష్ట్రపతి గారి ఆమోదం కోసం పంపటం జరిగిందన్నారు. రాష్ట్రపతి ఆమోదం పొందినప్పటికీ, తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పెట్టకుండా నిర్లక్ష్యం వహించడంతో సమస్య అలాగే ఉండిపోయిందన్నారు. ప్రతిపక్షంలో ఉండగా ఈ ఈనాం భూములపై మాట్లాడిన వైఎస్ జగనమోహన్రెడ్డి, అధికారంలోకి వచ్చిన తర్వాత సమస్యను పట్టించుకోకుండా వదిలేశారన్నారు, అసెంబ్లీలో బిల్లు పెట్టకుండా 5 లక్షల కుటుంబాలను జగన్ మోసం చేశారని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆవేదన వ్యక్తం చేశారు. తదుపరి అసెంబ్లీ సమావేశాల్లోనైనా ఈ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా దేవాదాయ శాఖ మంత్రికి ఆయన విజ్ఞప్తి చేశారు.
Be the first to comment