
రూ.60 కోట్లతో విజయవాడలో స్టేడియం ఆధునికీకరణ – 2026లో ఖేలో ఇండియా గేమ్స్!
విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో 2026లో ఖేలో ఇండియా గేమ్స్ నిర్వహణకు ప్రయత్నాలు – స్టేడియం ఆధునికీకరణకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించిన శాప్ శివ శంకర్
విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియానికి ఆధునిక సొబగులు అద్దేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం నగరపాలక సంస్థ ఆధీనంలో ఉన్న స్టేడియాన్ని ఆధునికీకరించేందుకు శాప్ కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. 2026 ఖేలో ఇండియా గేమ్స్‌తోపాటు భవిష్యత్తులో జాతీయ క్రీడలను ఈ మైదానంలో నిర్వహించేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇన్నాళ్లు రాజకీయ సభలకు వేదికగా నిలిచిన ఈ స్టేడియం ఇకపై పూర్తిగా క్రీడా మైదానంగా రూపుదిద్దుకోనుంది.
గతమెంతో ఘనమన్నట్లు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియానికి ఎంతో చరిత్ర ఉంది. ఎన్నో మెగా ఈవెంట్లు ఈ మైదానంలో జరిగాయి. 2002లో భారత్- వెస్టిండీస్ వన్డే మ్యాచ్‌కు 2004, 2007, 2014 సంవత్సరాల్లో జాతీయ జూనియర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలకు వేదికగా నిలిచింది. వాలీబాల్, నెట్ బాల్, హ్యాండ్ బాల్, కబడ్డీ వంటి ఎన్నో జాతీయస్థాయి పోటీలను ఈ మైదానంలో నిర్వహించారు. అలాంటి మైదానం కొన్నేళ్లుగా నిర్వహణ లేక రూపుకోల్పోయింది.
ప్రభుత్వాన్ని ఒప్పించి నగరపాలక సంస్థ నుంచి ఈ స్టేడియాన్ని తీసుకుని అభివృద్ధి చేసేందుకు శాప్ పాలకవర్గం కృత నిశ్చయంతో ఉంది. 2026లో ఖేలో ఇండియా గేమ్స్ ఇక్కడ నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈలోగా స్టేడియాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో 60 కోట్లతో కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు శాప్ ఛైర్మన్ రవినాయుడు చెప్పారు.
Be the first to comment