మీకేం కావాలో చెప్పండి… నేను చేస్తా: చిత్ర‌సీమ‌కు రేవంత్ హామీ

మీకేం కావాలో చెప్పండి… నేను చేస్తా: చిత్ర‌సీమ‌కు రేవంత్ హామీ

గద్ద‌ర్ అవార్డుల కార్య‌క్ర‌మం శ‌నివారం రాత్రి హైద‌రాబాద్ లోని హైటెక్స్ లో వైభ‌వంగా జ‌రిగింది. దాదాపు 14 ఏళ్ల త‌ర‌వాత తెలంగాణ ప్రభుత్వం నుంచి చిత్ర‌సీమ‌కు అందిన పుర‌స్కారాలు ఇవి. 14 ఏళ్ల అవార్డుల‌న్నీ ఒకే వేదిక‌పై అందించారు. ఊహించిన‌ట్టుగానే చిత్ర‌సీమ‌లోని ప్ర‌ముఖులంతా ఈ వేడుక‌లో పాలు పంచుకొన్నారు. రేవంత్ రెడ్డి ఈ వేదిక‌పై నుంచి చిత్ర‌సీమ‌కు వ‌రాలు కురిపిస్తార‌ని అంతా ఆశించారు. అయితే వ‌రాలేం రాలేదు కానీ, హ‌మీలు మాత్రం అందాయి. ‘చిత్ర‌సీమ‌కు అండ‌గా నేను ఉంటా’ అంటూ సీఎం ప్ర‌క‌టించారు. `హాలీవుడ్, బాలీవుడ్ సైతం ఇక్క‌డ‌కు రావాలి. హైద‌రాబాద్ అడ్డాగా మారాలి. అందుకు ఏం కావాలో అడ‌గండి.. నేను చేస్తా` అంటూ టాలీవుడ్ కు మాట ఇచ్చారు రేవంత్‌. రాష్ట్ర ప్ర‌భుత్వం కొన్ని క‌ఠిన మైన నిర్ణ‌యాలు తీసుకొన్నా, అది చిత్ర‌సీమ‌పై ప్రేమ‌తోనే అని, గ‌తంలో జ‌రిగిన‌వి మ‌ర్చిపోవాల‌ని, క‌ల‌సి క‌ట్టుగా ప‌ని చేయాల‌ని హిత‌వు ప‌లికారు రేవంత్.

తెలంగాణ విజ‌న్ డాక్యుమెంట్ లో చిత్ర‌సీమ‌కు ఓ చాప్ట‌ర్ ఇస్తామ‌ని, దాన్ని రాయించాల్సిన బాధ్య‌త చిత్ర‌సీమ‌దే అని వ్యాఖ్యానించారు. అన్ని రంగాల్లానే చిత్ర‌సీమ కూడా అభివృద్ది చెందాల‌ని, అందుకోసం తాను అన్ని విధాలా తోట్పాటు అందిస్తాన‌ని అన్నారు. రాబోయే రోజుల్లో తాను ఏ ప‌ద‌విలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా, త‌న స‌హాయ స‌హ‌కారాలు చిత్ర‌సీమ‌కు ఎప్పుడూ ఉంటాయ‌న్నారు. నాలుగోత‌రం హీరోల్లో చాలామంది త‌నకు తెలుస‌ని, త‌న‌తో చ‌దివిన వాళ్లు ఇప్పుడు చిత్ర‌సీమ‌లో గొప్ప స్థాయిలో ఉన్నార‌ని గుర్తు చేసుకొన్నారు రేవంత్ రెడ్డి. తెలుగు చిత్ర‌సీమ‌కు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అండ‌గానే ఉంటూ వ‌చ్చింద‌ని, అర‌వై ఏళ్ల క్రిత‌మే నంది అవార్డుల్ని ప్ర‌వేశ పెట్టి కళాకారుల్ని గౌర‌వించింద‌ని, ఆ సంప్ర‌దాయాన్ని ఇప్పుడు కొన‌సాగిస్తున్నామ‌ని చెప్పుకొచ్చారు ముఖ్య‌మంత్రి. తెలంగాణ గాయ‌కుడు రాహుల్ సిప్లిగంజ్‌కు ఈసారి గ‌ద్ద‌ర్ పుర‌స్కారం దక్క‌లేదు. ఈ విష‌యాన్ని రేవంత్ వేదిక‌పై ప్ర‌స్తావించారు. రాహుల్ కి కూడా ఏదో ఓ పుర‌స్కారం ఇస్తే బాగుండును అని, ఆ విష‌య‌మై ఆలోచ‌న చేయాల‌ని భ‌ట్టి విక్ర‌మార్క‌ని కోరారు.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*