గౌరవ మంత్రిమండలికి బహిరంగ వేడుకోలు విన్నపములు.
అమరావతి, ది.24-12-2024.
రిజిష్టర్‌పోస్ట్, మెయిల్, గౌరవ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా, ప్రజావేదిక (టి.డి.పి. ఆఫీస్), జనవాణి (జనసేన ఆఫీస్), వారధి (బి.జె.పి.ఆఫీస్), గౌరవ సి.ఎస్., గౌరవ సెక్రటరీస్ ల ద్వారా…
గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి మరియు గౌరవ మంత్రిమండలి లోని గౌరవ మంత్రులందరికీ పేరు పేరునా కాపు ఐక్యవేదిక పక్షాన నమస్కరించి వ్రాసుకొను బహిరంగ వేడుకోలు విన్నపములు.
అయ్యా / అమ్మా,
విషయం : ఈ వేడుకోలు వినతిపత్రములోని అంశాలపై ది.02-01-2025వ తేదీన నిర్వహించబోయే గౌరవ మంత్రి మండలి సమావేశములో చర్చించి కాపులకు మరియు సార్వజనీన కులాల వారికి సమన్యాయం – సమధర్మం చేయాల్సిందిగా గౌరవ మంత్రిమండలి వారిని వేడుకొనుట గురించి, దశాబ్దాల నుండి కాపు, తెలగ, బలిజ, ఒంటరి సామాజిక వర్గాల వారికి జరుగుచున్న సామాజిక అన్యాయాన్ని సవివరంగా తెలియజేయుట గురించి, తద్వారా సామాజికన్యాయం, సమన్యాయం, సమధర్మం కొరకు విన్నవించుకొనుట గురించి.
దశాబ్దాల కాలం నుండి అనగా 1956 వ సం.రం. నుండి కాపు, తెలగ, బలిజ, ఒంటరి సామాజిక వర్గాలవారికి తీవ్రమైన సామాజిక అన్యాయం జరుగుతూనే ఉంది. కాంగ్రెస్, టి.డి.పి., వై.సి.పి. పార్టీల వారు కాపులకు జరుగుచున్న అన్యాయాన్ని సరిచేసే దిశగా ఇంతవరకూ ఏవిధమైన శాశ్వత చర్యలు తీసుకొని యుండలేదు. కాపు ఐక్యవేదిక పక్షాన మేము కేవలం కాపుల ప్రయోజనాలకోసం మాత్రమే రాజకీయ పార్టీలకు అతీతంగా నిస్వార్ధంగా పనిచేస్తున్నాం. 2023వ సంవత్సరములో జరిగిన కాపు వనభోజనాల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కాపులు వై.సి.పి.కి ఎందుకు ఓటు వేయాలి? ఎందుకు వేయకూడదు? అనే సద్విమర్శతో కూడిన విశ్లేషణాత్మక కరపత్రాలను కోటి మంది కాపులకు ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ (సోషల్ మీడియా ద్వారా) బహిరంగంగా చేర్చడం జరిగింది. ఈ నేపధ్యంలో ప్రస్తుత ఎన్.డి.ఎ. కూటమి ప్రభుత్వం వారు కాపుల ప్రయోజనాలను కాపాడే విధంగానూ, కాపుల ఆత్మగౌరవాన్నీ, ఆత్మాభిమానాన్నీ పెంపొందించే విధంగానూ మీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటి? అని ఈ సందర్భంగా సూటిగా కాపు ఐక్యవేదిక పక్షాన తమరందరినీ ప్రశ్నిస్తున్నాం. ఇతర సామాజికవర్గాల వారి ప్రయోజనాలకు ఏమాత్రం భంగం వాటిల్లకుండా మాకు న్యాయం చేయమని మాత్రమే మేము కోరుచున్నాం. ఇతరుల ప్రయోజనాలకు భంగం కలిగించమని గతంలో ఏనాడూ కూడా ఏ కాపు సంఘాలవారు కూడా కోరియుండలేదు. భవిష్యత్తులో కూడా ఇతరులకు అన్యాయం చేసి మాకు న్యాయం చేయమని ఏనాడూ మేము కోరం. ఇతరులకు మేము అండగా నిలుస్తాం. మేము పెద్దన్న పాత్ర స్వాతంత్య్రానికి పూర్వం నుండి, ప్రస్తుతం కూడా పోషిస్తూనే ఉన్నాము. ఇతరుల ప్రయోజనాలను కాపాడేవిధంగా వివిధ ప్రభుత్వాలు తీసుకున్న పలు నిర్ణయాలను సంపూర్ణంగా స్వాగతించాం. కానీ, మా పరిస్థితి ఏమిటి? అని తమరందరినీ నేడు ప్రశ్నిస్తున్నాం. అడగకపోతే అమ్మ అయినా పెట్టదు అనే పెద్దల సామెతను ఇక్కడ తప్పక ప్రస్తావించాలి. అదే విధంగా ప్రజాప్రభుత్వం ప్రజలకు తల్లిదండ్రులతో సమానం. తల్లిదండ్రులు తమ బిడ్డలందరికీ ఏవిధంగా సమన్యాయం చేస్తారో, అదే విధంగా మాకు కూడా సమధర్మం, సమన్యాయం, సామాజిక న్యాయం చేయాలని కోరుచున్నాం. దశాబ్దాల కాలంగా మేము అన్యాయానికి, అధర్మానికి గురియగుచూనే ఉన్నాం.
కూటమి ప్రభుత్వం వారు క్షత్రియ సేవాసమితి వారి విజ్ఞప్తి మేరకు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి శ్రీ అల్లూరి సీతారామరాజు గారి పేరు పెడుతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. చాలా సంతోషం. మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. గత వై.సి.పి. ప్రభుత్వంవారు అల్లూరి సీతారామ రాజు గారి పేరు మీద ఒక నూతన జిల్లాను ఏర్పాటు చేసారు. దానిని కూడా మేము స్వాగతించాం. కానీ, కాపు సామాజికవర్గానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధులు శ్రీ కన్నెగంటి హనుమంతుగారికి ఇంత వరకూ న్యాయం జరగలేదు. స్వాంతంత్య్ర సమరయోధులపట్ల కూడా కులవివక్ష కొనసాగుతోంది అనడానికి ఇంతకంటే బలమైన ఉదాహరణ అవసరం లేదని మేము అభిప్రాయపడుతున్నాం. ఆనాటి బి.జె.పి. రాష్ట్ర అధ్యక్షులు నేటి టి.డి.పి. గౌరవ ఎమ్.ఎల్.ఎ. శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు గత వై.సి.పి. ప్రభుత్వం వారికి పల్నాడు జిల్లాకు శ్రీ కన్నెగంటి హనుమంతు గారి పేరు పెట్టాలని లేఖ వ్రాశారు. కానీ, ఆనాడు న్యాయం జరగలేదు. వై.సి.పి. ప్రభుత్వం వారు, కూటమి ప్రభుత్వం వారు కూడా అల్లూరి గారికి న్యాయం చేసారు. మరి కన్నెగంటి హనుమంతు గారు ‘కాపు’ కాబట్టి న్యాయం చేయరా? అని ఈ సందర్భంగా సూటిగా తమరందరినీ ప్రశ్నిస్తున్నాం. ఇదేనా సమన్యాయం? ఇదేనా సమధర్మం? ఇదేనా సామాజికన్యాయం? అని ప్రశ్నిస్తున్నాం.
ఆర్యవైశ్యుల విజ్ఞప్తి మేరకు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించే విధంగా కూటమి ప్రభుత్వం వారు సముచితమైన నిర్ణయం తీసుకున్నారు. మేము స్వాగతిస్తున్నాం. వాసవీ అమ్మవారు అందరికీ అమ్మవారే. అందులో ఏమాత్రం సందేహం లేదు. అదే విధంగా జనరంజకమైన పాలనను అందించిన గొప్ప చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయుల వారి జయంతిని, వర్ధంతిని అధికారికంగా జరపడానికి ప్రభుత్వానికి గల ఇబ్బంది ఏమిటి? అని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. మహర్షి వాల్మీకి గారి జయంతిని కూటమి ప్రభుత్వం వారు అధికారికంగా ప్రకటించారు. వాల్మీకి, బోయ సోదరుల ఆత్మగౌరవాన్నీ, ఆత్మాభిమానాన్నీ కాపాడే విధంగా సముచితమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. మరి అదే విధంగా బలిజల ఆత్మగౌరవాన్నీ, ఆత్మాభిమానాన్నీ కాపాడాలికదా? ఎంతకాలం ఈ వివక్షను పాలకపక్షాలవారు కొనసాగిస్తారు? క్షత్రియులకు ఒక న్యాయం, ఆర్యవైశ్యులకు ఒకన్యాయం, వాల్మీకి, బోయలకు మరొక న్యాయం, కాపు, బలిజలకు అసలు న్యాయమే లేదా? లేక న్యాయం జరగదా?
మాజీ రాజ్యసభ సభ్యులు, బి.జె.పి. సీనియర్ నాయకులు శ్రీ జి.వి.ఎల్.నరసింహారావు గారు గౌరవ భారత పార్లమెంట్ సాక్షిగా కాపు రిజర్వేషన్ల సమస్య రాష్ట్రప్రభుత్వ పరిధిలోనిదని, కాపులకు రిజర్వేషన్లు ఇవ్వాలంటే మీరు ఇచ్చుకోవచ్చు అని, కేంద్రానికి ఏవిధమైన అభ్యంతరం లేదని వ్రాతపూర్వకంగా గౌరవ భారత పార్లమెంటు సాక్షిగా నిరూపించుట జరిగింది. కానీ, నేటి వరకూ కాపులకు న్యాయం జరిగిందా? శ్రీ జి.వి.ఎల్. నరసింహారావు గారు మచిలీపట్నం కేంద్రంగా ఉన్న కృష్ణాజిల్లాకు శ్రీ వంగవీటి మోహనరంగా కృష్ణాజిల్లా అని, విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి శ్రీ వంగవీటి మోహనరంగా గారి పేరు పెట్టాలని గౌరవ రాజ్యసభలో డిమాండ్ చేసియున్నారు. అదేవిధంగా ఆనాటి మాజీ ఎమ్.ఎల్.ఎ., టి.డి.పి. పోలిట్ బ్యూరో సభ్యులు, ప్రస్తుత విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు శ్రీ బొండా ఉమామహేశ్వర రావు గారు మచిలీపట్నం కేంద్రంగా ఉన్న కృష్ణాజిల్లాకు శ్రీ వంగవీటి మోహనరంగా గారి పేరు పెట్టాలని ఉద్యమం, దీక్షను వై.సి.పి. ప్రభుత్వ కాలంలో చేసియున్నారు. కానీ, కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తరువాత ఆ విషయంలో దాటవేత ధోరణిని అనుసరిస్తున్నారు. రాష్ట్రంలో గల దాదాపు కాపు సంఘాలన్నీ కూడా శ్రీ వంగవీటి మోహనరంగా గారి పేరును కృష్ణాజిల్లాకు పెట్టాలని అప్పటి వై.సి.పి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం, అనేక వినతిపత్రాలు సమర్పించడం జరిగింది. కానీ, వై.సి.పి. ప్రభుత్వం వారు దురుద్దేశ్య పూర్వకంగా కావాలని కాపు-కమ్మ ఘర్షణలు, విద్వేషాలు ఇంకా కొనసాగాలనే లక్ష్యంతో ఎన్.టి.ఆర్.గారి పేరుతో నూతన జిల్లాను విజయవాడ కేంద్రంగా ఏర్పాటు చేసారు. కానీ, తదుపరి అదే వై.సి.పి. ప్రభుత్వంవారు ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్.టి.ఆర్.గారి పేరు తొలగించేసారు. ఎన్.టి.ఆర్.గారిపేరును ఆరోగ్య విశ్వవిద్యాలయానికి, కూటమి ప్రభుత్వం వారు అధికారంలోకి వచ్చిన వెంటనే పునరుద్ధరించారు. చాలా సంతోషం. స్వాగతిస్తున్నాం.
భవిష్యత్తులో కూడా కాపు-కమ్మ మైత్రి ఇలాగే కొనసాగేవిధంగానూ, బడుగు బలహీన వర్గాల, కాపుల అభిమాన పాత్రుడైన శ్రీ వంగవీటి మోహనరంగా గారి పేరును కృష్ణాజిల్లాకు పెట్టాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం వారిపై చాలా బలంగా ఉందని ఈ సందర్భంగా తమరందరికీ విన్నవించుకొనుచున్నాం. అధికారంలో ఉన్నప్పుడు ఒక విధంగానూ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరో విధంగానూ వ్యవహరించడం సమంజసం కాదు. చంద్రబాబునాయుడు గారి అనుమతి లేకుండా పోలిట్‌బ్యూరో సభ్యుడైన శ్రీ బొండా ఉమామహేశ్వరరావు గారు దీక్ష, ఉద్యమం చేసే పరిస్థితి ఉండదు. శ్రీ వంగవీటి మోహనరంగా గారి హత్య టి.డి.పి.ప్రభుత్వ కాలంలోనే జరిగింది. ఆ హత్యకు సంబంధించిన విషయాలను ఇప్పుడు మేము ప్రస్తావించదలచుకోలేదు. కానీ రంగాగారి ఆత్మకు శాంతి చేకూరే విధంగానూ, రంగాగారి అభిమానుల, కాపుల ఆత్మగౌరవాన్నీ, ఆత్మాభిమానాన్నీ కాపాడే విధంగానూ కూటమి ప్రభుత్వం వారు వ్యవహరించాలా? లేదా? అనేది మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం.
అదేవిధంగా కూటమి పక్షాన బి.సి.లకు స్థానిక సంస్థలలో 34% రిజర్వేషన్లు అమలు చేస్తామని ఎన్నికల హామీ ఇచ్చారు. ఆ హామీని నెరవేర్చే దిశగా ముందుకు వెళ్ళుచున్నారు. అదే విధంగా చట్టసభలలో బి.సి.లకు 33% రిజర్వేషన్లు అమలు చేయాలని గౌరవ అసెంబ్లీలో తీర్మానం చేసి, గౌరవ పార్లమెంటుకు నివేదించారు. ఆ చర్యలను మేము స్వాగతిస్తున్నాం. అంతేకాకుండా బి.సి.లకు విద్య, ఉద్యోగాలలో కూడా 34% రిజర్వేషన్లు అమలు చేయాలని కాపు ఐక్యవేదిక పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. మేము పెద్దన్నపాత్ర పోషిస్తున్నాం. ప్రభుత్వ ద్వంద్వ నీతిని, ద్వంద్వ విధానాలను మేము ప్రశ్నిస్తున్నాం. ప్రస్తుతం బి.సి.లు విద్య, ఉద్యోగాలలో పొందుచున్నది 24% మాత్రమే. ఒక చోట 24%, మరోచోట 34% ఇదేమి ద్వంద్వ నీతి? బి.సి.లకు విద్య, ఉద్యోగాలలో కూడా 34% రిజర్వేషన్లు అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా 2019 ఎన్నికలలో జనసేన మేనిఫెస్టోలో బి.సి.లకు మరో 5% రిజర్వేషన్లు పెంచుతామన్న జనసేనాని హామీని ఇప్పుడు నెరవేర్చాలని మేము కోరుచున్నాం.
కాపు రిజర్వేషన్ల సమస్యకు అంతిమ పరిష్కారం రాజకీయ పరిష్కారం మాత్రమే. రాష్ట్ర ప్రభుత్వం వారు అటు ఓ.సి.లకు గాని, ఇటు బి.సి.లకు గాని ఇబ్బంది లేకుండా కాపులకు రిజర్వేషన్లు ఇవ్వాలని చిత్తశుద్ధితో భావిస్తే, ఎటువంటి న్యాయ వివాదాలు లేకుండా ఇవ్వవచ్చు. ఇవ్వకూడదు అని భావిస్తే ఇవ్వరు అదంతే. నిద్రపోయేవారిని లేపొచ్చుగానీ, నిద్రనటించే వారిని తట్టిలేపలేం. గౌరవ హైకోర్టు వారు సమర్ధించిన కాపు రిజర్వేషన్ల జి.ఓ.నెం.30ని గత 30 సంవత్సరాలుగా తుంగలోకి తొక్కేసింది టి.డి.పి., కాంగ్రెస్, వై.సి.పి.లే. రాజ్యాంగ విరుద్ధమని గౌరవ హైకోర్టువారు రెండు పర్యాయాలు తిరస్కరించినా కూడా గౌరవ సుప్రీం కోర్టులో స్పెషల్ లీవు పిటీషన్ వేసి స్టే ద్వారా బి.సి.(ఇ) 4% ముస్లిం రిజర్వేషన్లను నిరాటంకంగా సుమారుగా గత 18 సం.ల నుండి అమలు చేస్తున్నది కాంగ్రెస్, టి.డి.పి., వై.సి.పి. ప్రభుత్వాలే. కాపులకు ఒక న్యాయం, ముస్లింలకు మరొక న్యాయం. ఇదే ఆంధ్రప్రదేశ్‌లోని పాలకవర్గాలవారి నాలుగు పాదాల న్యాయం, ధర్మం.
కాశ్మీర్ సమస్యకూడా పరిష్కరించబడింది కానీ కాపుల సమస్య పరిష్కరించబడలేదు అని స్వయంగా జనసేనాని గారు బహిరంగంగా గతంలో అన్నారు. అంతేకాకుండా వారు 2019 ఎన్నికల మేనిఫెస్టోలో కాపులకు బి.సి.రిజర్వేన్లు కల్పిస్తామని హామీ కూడా ఇచ్చారు. టి.డి.పి.వారు 2014వ సంవత్సరంలో అధికారంలోకి వచ్చిన ఆరు మాసాల లోపు కాపులకు బి.సి. రిజర్వేషన్లు అని ఎన్నికల హామీ ఇచ్చి, ఈ రాష్ట్రంలో కాపులు బి.సి.లా లేక ఓ.సి.లా అనే తెలియని అయోమయ స్థితికి నెట్టేసి చేతులు దులిపేసుకున్నారు. ఇంత వరకూ కాపులకు న్యాయం జరగలేదు. కూటమి ప్రభుత్వం వారికి చిత్తశుద్ధి ఉంటే మహారాష్ట్రలో మరాఠాలకు ఇచ్చిన మాదిరిగా కాపులకు వారి జనాభా ప్రాతిపదికగా అటు ఓ.సి.లకు గాని, ఇటు బి.సి.లకు గాని ఇబ్బంది లేకుండా 10% ప్రత్యేక బి.సి. రిజర్వేషన్లు కల్పించాలి (లేదా) వై.సి.పి. వారి మాదిరిగా కాపు రిజర్వేషన్లు సాధ్యం కాదని ప్రకటించేయాలి. అంతేగాని దేశవ్యాప్తంగా బి.జె.పి.ప్రభుత్వం వారు ఇచ్చిన EWS 10% రిజర్వేషన్లలో కాపులకు 5% సబ్‌కోటా ఇచ్చి మరో నూతన సమస్యను దయచేసి సృష్టించవద్దు. మాకు మరింత అన్యాయం చేయవద్దు. EWS లో 5% సబ్‌కోటా వలన మాకు తీరని నష్టం, తీవ్ర అన్యాయం జరుగుతుంది. కావున మేము ఏ దశలోనూ కూడా దానికి అంగీకరించబోమని, ప్రభుత్వం వారు మొండిగా ఆ దిశగా ముందుకు వెళితే గౌరవ హైకోర్టువారిని మేమే ఆశ్రయించాల్సి వస్తుందని ఈ సందర్భంగా తమరికి సవినయంగా తెలియజేసుకొనుచున్నాము. కాపులు మినహా ఇతర ఓ.సి.లకు (బ్రాహ్మణ, క్షత్రియ, ఆర్యవైశ్య, వెలమ, కమ్మ, రెడ్డి, ముస్లిం తదితర) EWS 10% రిజర్వేషన్లు కొనసాగించాలని మేము డిమాండ్ చేయుచున్నాము.
కూటమి ప్రభుత్వం వారిని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఒకవైపు సనాతనధర్మం అని ప్రకటిస్తూ సమధర్మాన్ని మీరు ఎందుకు పాటించడం లేదు? సనాతన ధర్మం ఎంత ముఖ్యమో సమధర్మం కూడా అంతేముఖ్యం. సనాతన ధర్మం అంటూనే రాజ్యాంగవిరుద్ధమైన మత ప్రాతిపదిక రిజర్వేషన్లను మీరు ఏ విధంగా కొనసాగిస్తున్నారు? గౌరవ కేంద్ర హోమ్ శాఖామాత్యులు శ్రీ అమిత్‌షా గారు రాజ్యాంగ విరుద్ధమైన మత ప్రాతిపదిక రిజర్వేషన్లను రద్దుచేసి, ఆ రిజర్వేషన్లను ఓ.బి.సి.లకు వర్తింపజేస్తామని, ఇది ఎన్.డి.ఎ. విధానమని బాహాటంగా ప్రకటిస్తుంటే ఆ విధంగా మీరు ఎందుకు ముందుకు వెళ్ళడం లేదు? మైనార్టీలలో ముస్లింలు గరిష్ఠంగా 31% (ముఫ్పైఒక్కశాతం) రిజర్వేషన్లు పొందుచూ ఉండగా, అదే మైనార్టీవర్గానికి చెందిన దళితక్రైస్తవులు కేవలం ఒకే ఒక్క శాతం (1%) బి.సి.(సి) రిజర్వేషన్‌తో నష్టపోతుంటే ఈ సామాజిక అన్యాయాన్ని సరిజేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు లేదా? అని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. ముస్లిం మైనార్టీలు బి.సి.(ఎ) ద్వారానూ, బి.సి.(బి) ద్వారానూ, EWS ద్వారానూ కూడా లబ్ధి పొందుచున్నారు. ఈ నేపధ్యంలో బి.సి.(సి), బి.సి.(డి), బి.సి.(ఇ) ఈ మూడు గ్రూపులను ఒకే గ్రూపుగా విలీనం చేసి, రాజ్యాంగబద్ధంగా ముస్లింలకు, దళిత క్రైస్తవులకు, అధిక జనాభా కలిగిన బి.సి.(డి) గ్రూపువారికీ సమన్యాయం చేయడానికి గల ఇబ్బంది ఏమిటి? అని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. బి.సి.(సి) ద్వారా దళిత క్రైస్తవులను, బి.సి.(ఇ) ద్వారా ముస్లింలను రాజ్యాంగ విరుద్ధంగా ఐసోలేట్ చేయడం ఎంతవరకూ సమంజసం? బి.సి.(ఎ)లోనూ, బి.సి.(బి)లోనూ, EWS లోనూ ముస్లింలు కొనసాగుతున్నప్పుడు వారిని బి.సి.(ఇ) ద్వారా ఐసోలేట్ చేయడం ఎంత వరకూ సమంజసం? ఈ రాష్ట్రంలో కాపుల వలన బి.సి.లు నష్టపోయారా? లేక ముస్లింల వలన బి.సి.లు నష్టపోతున్నారా? అని ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఒక మైనార్టీ వర్గం వారికి 31% రిజర్వేషన్లా? ఇదేనా సమన్యాయం? ఎంతకాలం ఈ దాటివేత ధోరణి? ఎంతకాలం ఈ వివక్ష? బి.సి.లు, కాపులు, పేద ఓ.సి.లు, దళిత క్రైస్తవులు ఓటర్లు కాదా? వారి ఓటు బ్యాంకు ఆయా పార్టీల వారికి అవసరం లేదా? కాపులతో పాటు బి.సి.లకు పేద ఓ.సి.లకు, దళిత క్రైస్తవులకు, ముస్లింలతో సహా సార్వజనీన కులాల వారందరికీ, సకలజనులకు జనాభా ప్రాతిపదికగా ఎలా న్యాయం చేయవచ్చు అనేది శాస్త్రీయ గణాంకాలతో సహా మేము మీకు తెలియజేస్తున్నాం. దయచేసి మీరు మాకు ఒక అపాయింట్‌మెంట్ ఇవ్వండి, సవివరంగా, ప్రత్యక్షంగా మేము తమరికి తెలియజేయ గలవారము. మా డిమాండ్లపై గౌరవ మంత్రివర్గ ఉపసంఘాన్ని గాని, అఖిలపక్ష కమిటీని గాని నియమించండి. మా డిమాండ్లలో ఏ డిమాండ్ అయినా శాస్త్రీయత లేదని మీరు శాస్త్రీయంగా నిరూపించినట్లయితే ఆ డిమాండ్ నుండి మేము వైదొలుగుతాం. దయచేసి ఈ ప్రభుత్వం మంచిది, ఈ ప్రభుత్వం అందరిదీ, ఈ ప్రభుత్వం అందరికీ సమధర్మం, సమన్యాయం, సామాజికన్యాయం చేస్తుంది, తల్లిదండ్రుల మాదిరిగా వ్యవహరిస్తుందనే రీతిలో వ్యవహరించాలని తమరందరినీ చేతులు జోడించి వేడుకొనుచున్నాం.
అయ్యా! పవన్ కళ్యాణ్ గారూ 70 సం.లు గా గిరిజనులకు జరుగుచున్న అన్యాయంపై తమరు స్పందించారు. చాలా సంతోషించాం. అదే విధంగా కాపులకు గత 70 సం.లుగా జరుగుచున్న అన్యాయంపై తమరు స్పందించి, జనాభా ప్రాతిపదికగా సార్వజనీన కులాలవారందరికీ సమన్యాయం చేయించండి. సనాతన ధర్మానికీ, సమధర్మానికీ సమ ప్రాధాన్యతనివ్వండి. ఈ ప్రజాప్రభుత్వం కాపులతో పాటు బి.సి.లకు, పేద ఓ.సి.లకు, దళిత క్రైస్తవులకు, ముస్లింలకు సమన్యాయం, సమధర్మం చేస్తుందని బలంగా విశ్వసిస్తూ, బలంగా ఆకాంక్షిస్తూ . . .
సామాజిక ఉద్యమాభివందనములతో….
తమ విశ్వసనీయ…
కాపు ఐక్యవేదిక.
రావి శ్రీనివాస్
రాష్ట్ర ఛైర్మన్
సెల్: 9949249170
బోడపాటి పెదబాబు
రాష్ట్ర కన్వీనర్
సెల్ : 9494122866
పంచాది రంగారావు
రాష్ట్ర కన్వీనర్
సెల్ : 7036537388
కాకిలేటి హరనాథ్
రాష్ట్ర కో-కన్వీనర్
సెల్ : 9346721379
మెర్ల నాగ సత్యనారాయణ
రాష్ట్ర కో-కన్వీనర్
సెల్ : 7989941883
స్థలం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతటా…
తేదీ : సమధర్మం, సమన్యాయం, సామాజికన్యాయం జరిగేంతవరకూ…
చిరునామా : ఫ్లాట్ నెం.304, సత్యశ్రీ ప్లాజా, వెంకటరాయపురం- 534215, తణుకు, ప.గో.జిల్లా
(దయచేసి షేర్ చేయండి, వైరల్ చేయండి.)


Be the first to comment