ఎవరెంత చెప్పినా… జనసేనే ప్రత్యామ్నాయం!

ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి సుమారు ఏడు దశాబ్దాలు కావస్తున్నా, ఇప్పటి వరకు కాపు సమాజం రాజ్యాధికారం కోసం ఎదురు చూస్తూనే ఉంది. ఎన్నోసార్లు ఆ అవకాశం తలుపు తట్టినా, ఇతర అగ్రకులాల రాజకీయ చదరంగంలో పావుల్లా మారటమో, మరో ఇతరత్రా కారణాలవల్లో పీఠం చేతికి చిక్కినట్టే చిక్కి దోబూచులాడింది.

2009లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు, ఉరకలెత్తే ఉత్సాహం, పరుగులెత్తే పౌరుషంతో రాజ్యాధికారానికి చేరువయ్యే సమయం ఆసన్నమైందన్న ఆశలు కాపు సమాజంలో మళ్లీ చిగురించాయి. తర్వాత ఏం జరిగిందో మనందరికీ తెలిసిందే!

ఇక 2014 ఎన్నికల ముందు పవర్ స్టార్ గా, మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా తెలుగు ప్రజలకి సుపరిచితుడైన పవన్ కళ్యాణ్, జనసేన పేరుతో నూతనంగా ఒక పార్టీని స్థాపించాడు. 2014 ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోటీ చేయకుండా తెలుగుదేశం, బిజెపి పార్టీలకు మద్దతు ప్రకటించి, అప్పుడే నూతనంగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గెలుపుకు కీలకంగా మారాడు. ఆ ప్రభుత్వ పాలనా కాలంలో ప్రజా మద్దతును, ముఖ్యంగా కాపు సమాజ మద్దతును సంపూర్ణంగా కూడగట్టుకోవడంలో జనసేన పార్టీ విఫలం చెందిందనే చెప్పుకోవాలి. ఇదెలా చెప్పవచ్చన్నది 2019 ఎన్నికల ఫలితాలే నిదర్శనం.

దీనికి మనం ఎవర్ని నిందించినా… ఎవర్ని తప్పు పట్టినా… రాజ్యాధికారానికి నేటి వరకూ మనం దూరంగానే ఉన్నామన్నది ఒప్పుకోక తప్పని సత్యం! ఈ పాత చరిత్రనే మళ్లీ మళ్లీ చెప్పుకోవడం అన్నది ఎలా ఉందంటే… పాతరేయాల్సిన పాత జ్ఞాపకాల్ని తవ్వి తీసి, అక్కడే ఆగిపోవడం లాగా!

అయితే ఈ 2024 ఎన్నికలు, గతంలో కాపుల్లో ఎన్నడూ లేనంత ఉత్కంఠ, ఉద్వేగం రగిలించాయంటే అందుకు కారణం… జనసేన పార్టీ వ్యూహాత్మక ప్రణాళికలు, రాజకీయ సమీకరణాల విషయంలో చేపట్టిన ప్రత్యేక శ్రద్ధ!

మరో విషయం కూడా తప్పకుండా చెప్పుకోవాలి. ఈ ఎన్నికల ముందు ఒక సంవత్సరం క్రితం వరకూ స్థబ్దుగా ఉన్న జనసేన పార్టీని, జనసేనాని నీ తట్టి తట్టి లేపడంలో అప్పటి అధికార పార్టీ… అదేనండి జగన్ రెడ్డి తన శాయశక్తులా కృషి చేశాడు. సందర్భం ఉన్న లేకపోయినా పదేపదే పవన్ కళ్యాణ్ పై విషం చిమ్ముతూ, అడుగడుగునా తన సాధారణ కార్యకలాపాలకు కూడా అడ్డు తగులుతూ, జనసేన పట్ల ప్రజల్లో సానుభూతినీ, జన సైనికులకు తమ అధినాయకుడి పట్ల ప్రగాఢ విశ్వాసాన్ని పెంపొందించేలా చేశాడు. దీనికి తగ్గట్టుగా జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా ప్రస్తుత రాజకీయ ఒరవడికి తగ్గట్టుగా తననితాను అప్డేట్ చేసుకుంటూ, ఒకపక్క వైఛీపీ ఎత్తుగడల్ని తిప్పి కొట్టడంలో సఫలీకృతం అవుతూనే, మరోపక్క భారతీయ జనతా పార్టీ ఈ గేమ్ లోకి ప్రవేశించడానికి అనువైన వాతావరణాన్ని, అవసరమైన పరిస్థితుల్ని కల్పించాడనే చెప్పాలి. దీనికితోడు వైసీపీ తన సొంత పార్టీలో ఉన్న కాపు సామాజిక వర్గానికి చెందిన సామినేని ఉదయభాను లాంటి వ్యక్తులను కించపరుస్తూ, పదవులకు దూరంగా ఉంచుతూ, అధికారులతో అవమానంపాలు చేసింది. ఇలాంటి సంఘటనలు ఎన్నెన్నో జరిగాయి. అప్పటిదాకా అసంఘటితంగా ఉన్న కాపు, తెలగ, బలిజ, ఒంటరి తదితర ఉపకులాలు సంఘటితమై కాపు సమాజం సత్తాను చాటి చెప్పారు.

అన్నీ వెరసి… కాపు సమాజం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న రాజ్యాధికారం దరిదాపుల్లోకి వచ్చేసింది. తెలుగుదేశం పార్టీ ప్రధాన భాగస్వామిగా ఉన్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తమ అఖండ విజయానికి ప్రధాన కారకుడైన జనసేనాని పవన్ కళ్యాణ్ కి ఉపముఖ్యమంత్రి స్థానమిచ్చి గౌరవించుకుంది. ఈ విషయం ప్రస్తుతం రాజ్యాధికారంలో భాగస్వామ్యమే అయినా, రానున్న రోజుల్లో అది సంపూర్ణ రాజ్యాధికారానికి ఒక మెట్టు దూరమే అన్నది తేటతెల్లమయ్యింది.

ఇక తదుపరి కార్యాచరణ ప్రారంభమైంది. రాష్ట్రంలో నిన్నటి వరకూ ప్రధాన పార్టీగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ అంతర్గత రాజకీయాలతోపాటు, ఇంటిచాటున జరగాల్సిన వ్యవహారాలు బజార్లోకి తెచ్చుకుని బావురుమంటోంది. ఇన్నాళ్లు తమకు ఎదురే లేదన్న పొగరుతో విచ్చల విడిగా ప్రవర్తించిన వైసిపి నాయకులు, ప్రజా తీర్పు ముందు ఎవ్వరూ ఎక్కువ కాదన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అప్పటి వరకు దుష్ట నాయకత్వంలో బ్రతుకులీడ్చిన సీనియర్లు, ఆ పార్టీని వదిలి నలదిక్కులా వెతుకులాట ప్రారంభించారు. ఇట్లాంటి సమయంలోనే జనసేన పార్టీ, వైసీపీలో భావ సారూప్యత ఉన్న నాయకులను, తటస్థ వైఖరిలో ఉన్న నాయకులను జనసేనలోకి ఆహ్వానించడం ద్వారా రాజకీయ పరిపక్వతను ప్రదర్శిస్తోంది.

ఇక్కడ మనమొక విషయాన్ని గమనించాలి. రాజకీయాల్లో శూన్యత అన్నది ఒక్కోసారి ఉంటుంది. మరికొన్నిసార్లు చేసుకోవాల్సి ఉంటుంది.

2019లో 151 సీట్లతో గెలుపొందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పనిచేసుంటే, ఆంధ్రప్రదేశ్లో మరే ఇతర పార్టీకి అవకాశం ఇవ్వనంతగా అభివృద్ధి చేసి, మళ్లీ విజయాన్ని కైవసం చేసుకోవచ్చు. కానీ వాళ్ల అనుభవ రాహిత్యం అనే కన్నా డబ్బు, అధికారమదంతో అందాన్ని కాడికి అందినకాడికి దండుకోవడంతో ప్రజల్లో వ్యతిరేకత తీవ్రరూపం దాల్చింది. 151 లోని మధ్యలో 5 అంకెను తీసివేయడం ద్వారా 11 స్థానాల ఘోర అవమానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్కు అప్పగించింది ప్రజాతీర్పు 2019 నుండి నిన్నటి వరకూ ఆ ప్రభుత్వం చేసిన ప్రతీ తప్పిదాన్ని బయటికి లాగి, వాటికి తగిన మూల్యం చెల్లించేదాకా తెలుగుదేశం పార్టీ వదిలి పెట్టదు. అయితే వైసీపీలో ఇప్పటికీ బలంగా ఉన్న క్యాడర్ ని, కిందిస్థాయి నాయకుల్ని, కార్యకర్తల్నీ సమూలంగా మార్చలేక పోతే, అది 2029 ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం లేకపోలేదు.

చివరిగా ఒక్క మాట. జనసేన పార్టీ రాజకీయాల్లో వ్యవహరిస్తున్న తీరుకు మహా మహా రాజకీయ పండితులు కూడా ‘ఔరా’ అనక తప్పని పరిస్థితులున్నా, పై స్థాయి అధినాయకులనుండీ క్రిందిస్థాయి కార్యకర్తల వరకూ వినయవిధేయరాముడిలా కాకుండా రాజకీయాన్ని రాజకీయంగా చూడడం నేర్చుకోవాలి. అప్పుడే కాపు సమాజం చెరకాలంగా ఆశిస్తున్న రాజ్యాధికారం సాక్షాత్కరిస్తుంది.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*