యువకుడికి ‘రెండోసారి’ ఉరిశిక్ష.. అసలేం జరిగిందంటే

ఇరాన్‌లో ఇటీవల ఉరిశిక్షలు భారీగా పెరిగాయని ఐహెచ్‌ఆర్‌ పేర్కొంది. ఒక్క అక్టోబర్‌లోనే రికార్డు స్థాయిలో 166 మందికి ఉరిశిక్ష అమలు చేసినట్లు తెలిపింది. చైనా మినహా మరే దేశంలో లేని విధంగా ఇరాన్‌లో మరణశిక్షలు అమలవుతున్నాయని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు.ఓ హత్య కేసులో దోషిగా తేలిన యువకుడికి కొన్ని నెలల క్రితం ఉరిశిక్ష (Execution) అమలు చేశారు. అయితే, ఉరికంబంపై వేలాడదీసిన కొద్దిసేపటికే బాధితుడి (హత్యకు గురైన వ్యక్తి) కుటుంబీకులు ‘క్షమాపణ’కు అంగీకరించడంతో అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ, పరిహారంపై (Blood Money) బాధిత కుటుంబంతో ఒప్పందం కుదరకపోవడంతో.. ఇటీవల అతడికి రెండోసారి ఉరిశిక్ష అమలు చేశారు. ఇరాన్‌ (Iran)లో ఈ వ్యవహారం వెలుగుచూసింది.

ఇరాన్‌కు చెందిన అహ్మద్‌ అలీజెదా (26) ఓ హత్య కేసులో 2018లో అరెస్టయ్యాడు. తనపై నమోదైన అభియోగాలను అతడు తిరస్కరించినప్పటికీ.. చివరకు ఉరిశిక్ష పడింది. ఈ క్రమంలోనే ఏప్రిల్‌ 27న టెహ్రాన్‌కు సమీపంలోని గెజెల్‌ హెసర్‌ జైళ్లో ఉరిశిక్ష అమలు చేపట్టారు.

ఉరికంబం ఎక్కిన 28 సెకన్లకు.. బాధిత తరఫు కుటుంబీకులు ‘క్షమాభిక్ష’ అంటూ గట్టిగా అరిచారు. శిక్షను నిలిపివేసి.. వెంటనే అతడిని ఉరికంబం నుంచి కిందకు దించారు. నిర్జీవంగా కనిపించినప్పటికీ చివరకు ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే, బాధిత కుటుంబంతో ఒప్పందం కుదరకపోవడంతో తాజాగా అతడికి రెండోసారి ఉరిశిక్ష అమలు చేశారు. ఈ విషయాన్ని ఇరాన్‌లో మరణశిక్షలను నివేదిస్తున్న నార్వే కేంద్రంగా పనిచేసే ఇరాన్‌ హ్యూమన్‌ రైట్స్‌ (IHR) పేర్కొంది.

 

ఇరాన్‌లో క్షమాభిక్ష లేదా పరిహారాన్ని (Blood Money) కోరడం ద్వారా నేరస్థుడిని శిక్ష నుంచి తప్పించే వీలుంటుంది. అయితే, చాలా కేసుల్లో ఆ పరిహారం భారీగా ఉండటంతో ఉరిశిక్షే అమలవుతుందని సామాజిక కార్యకర్తలు పేర్కొంటున్నారు.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*