రైల్వే ఉద్యోగాలలో తెలంగాణకు తీవ్ర అన్యాయం.యం.డి.కుతూబ్ ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి

తెలంగాణ కాపు న్యూస్ ప్రతినిధి

రైల్వే ఉద్యోగాలలో తెలంగాణకు తీవ్ర అన్యాయం.యం.డి.కుతూబ్ ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి

రైల్వే ఉద్యోగాల భర్తీలో కేంద్ర ప్రభుత్వం చాలా ఏండ్ల నుంచి తెలుగు రాష్ట్రాల యువతకు తీవ్ర అన్యాయం చేస్తున్నదని, రైల్వే ఉద్యోగాలలో తెలంగాణకు అన్యాయం చేస్తే ఉద్యమిస్తామని అఖిల భారత యువజన సమాఖ్య (ఏ ఐ వై ఎఫ్) జిల్లా కార్యదర్శి యం.డి.కుతూబ్ అన్నారు.అఖిల భారత యువజన సమాఖ్య (ఏ ఐ వై ఎఫ్) అమరచింత మున్సిపల్ పరిధిలోని రెండో మూడో వార్డుల ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా యం.డి.కుతూబ్ మాట్లాడుతూ:- దేశంలో అత్యున్నత సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ లాంటి ఉద్యోగాల భర్తీకే 13 ప్రాంతీయ భాషల్లో రాత పరీక్షలు నిర్వహిస్తుంటే.. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ఆర్బీ) ల ద్వారా భర్తీ చేసే ఉద్యోగాలకు మాత్రం కేవలం ఇంగ్లిష్, హిందీ భాషల్లోనే పరీక్షలు నిర్వహిస్తున్నారని, దీంతో ఆ ఉద్యోగాలన్నీ ఉత్తరాదివారికే లభిస్తున్నాయని ఆరోపించారు. రైల్వే ఉద్యోగాల్లో స్థిరపడాలన్న తెలుగు యువత ఆశలు నెరవేరడం లేదని వాపోయారు. దీనిపై ఎన్ని విజ్ఞప్తులు చేసినా కేంద్ర ప్రభుత్వంగానీ, రైల్వే శాఖ మంత్రి గానీ పట్టించుకున్న పాపాన పోలేదన్నారు.దేశవ్యాప్తంగా అన్ని రైల్వే జోన్ల పరిధి లోని ఆర్ఆర్బీ ల ఆధ్వర్యంలో 5,696 అసిస్టెంట్ లోకో పైలెట్ ఉద్యోగాల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేశారన్నారు. డిప్లొమా, ఇంజినీరింగ్ లాంటి టెక్నికల్ విద్యలు నేర్చుకున్న నిరుద్యోగ యువతను ఈ పోస్టుల్లో భర్తీ చేయనున్నట్టు నోటిఫికేషన్లో పేర్కొన్నారన్నారు. వీటిలో దాదాపు 750 పోస్టులు సికింద్రాబాద్ ఆర్ఆర్బీ పరిధిలో భర్తీ చేయనున్నారన్నారు. మెరిట్ తో పాటు కంప్యూటర్ బేస్డ్ టెస్టులు, ఇంటర్వ్యూల ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నప్పటికీ అసలైన రాత పరీక్షలను మాత్రం హిందీ, ఇంగ్లిష్ లోనే నిర్వహిస్తున్నారన్నారు. అంటే హిందీ, ఇంగ్లిష్ భాషలు నేర్చుకున్న వారికే ఆర్ఆర్బీ ప్రాధాన్యమిస్తున్నదని విమర్శించారు. దేశంలోని ఎన్నో మాతృ భాషలు ఉన్నప్పటికీ తప్పనిసరిగా హిందీ, ఇంగ్లిష్ భాషలను నేర్చుకోవాల్సిన పరిస్థితిని కల్పిస్తున్నదని, తద్వారా దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని తెలంగాణ, ఏపీ యువతకు రైల్వే ఉద్యోగాలు ఎన్నటికీ లభించవని కేంద్ర ప్రభుత్వం చెప్పకనే చెప్తున్నదని వారు విమర్శించారు. త్వరలో జరగనున్న అసిస్టెంట్ లోకో పైలెట్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన రాత పరీక్షలను తెలుగులో రాసేందుకు అనుమతించాలని వారు కేంద్ర ప్రభుత్వం మరియు ఆర్ ఆర్ బీ బోర్డ్ ను డిమాండ్ చేశారు. డిమాండ్లు గట్టిగా వినిపిస్తున్నాయి. అయినా రైల్వే బోర్డు ఈ సమస్యను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని వారు హెచ్చరించారు. అదే విధంగా ఈ అంశంపై ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు వెంటనే స్పందించి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు అన్నారు.
ఈ సమావేశంలో ఏఐవైఎఫ్ కార్యకర్తలు రవి,రాము, ఉదయ్, కిరణ్ ,మైబూ, చంద్రయుడు,కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*