సినిమా టికెట్ ధరలను ప్రభుత్వం ఊరికే పెంచడం లేదని.. దాని వల్ల జీఎస్టీ రూపంలో ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. రామ్ చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘గేమ్ ఛేంజర్’ సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా రాజమహేంద్రవరంలో ‘మెగాపవర్ ఈవెంట్’ను చిత్రబృందం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పవన్ ల్యాణ్ పలు అంశాలపై మాట్లాడారు. ముఖ్యంగా టికెట్ ధరల పెంపు విషయంలో నెగెటివ్ ప్రచారం జరుగుతోందని అన్నారు.
“టికెట్ ధరల పెంపు అనేది డిమాండ్ అండ్ సప్లయ్ ఆధారంగా ఉంటుంది. దర్శకుడు శంకర్ ‘జెంటిల్ మేన్’ మూవీని అప్పట్లో నేను బ్లాక్ టికెట్ కొని చూశాను. అలా టికెట్ కొనడం వల్ల ఆ డబ్బు వేరేవాళ్లకు వెళ్తుంది. ప్రభుత్వం టికెట్ ధరలు పెంచడం వల్ల జీఎస్టీ రూపంలో ఆదాయం వస్తుంది. నా సినిమాలకు టికెట్ ధరలు పెంచలేదు. గత ప్రభుత్వం ‘భీమానాయక్’ టికెట్ ధరలు పెంచకపోగా, తగ్గించింది. కూటమి ప్రభుత్వానికి సినీ నటులు అందరూ మద్దతు తెలపలేదు. అయినా కూడా మేము ఎవరికీ వ్యతిరేకం కాదు. సినీ పరిశ్రమకు రాజకీయ రంగు పులమడం కూటమి ప్రభుత్వానికి ఇష్టం లేదు”
“టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ అని కాదు. భారతీయ చిత్ర పరిశ్రమ అనేదే మన నినాదం. హాలీవుడ్ పద్ధతులు పాటించకపోయినా ‘వుడ్’ మాత్రం తీసుకున్నాం. మన జాతి ప్రాముఖ్యతను సినిమాల ద్వారా ప్రపంచానికి చూపించాలి. చిత్ర పరిశ్రమలో క్రమశిక్షణ రావాలి. తెలుగు చలన చిత్ర పరిశ్రమ గురించి మాట్లాడాలంటే సినిమాలు తీసే వాళ్లే మాట్లాడాలి. సినిమాలు తీసే వాళ్లతోనే మేం మాట్లాడుతాం. సినిమా టికెట్ ధరల విషయంలో హీరోలతో పనేంటి? నిర్మాతలు రావాలి. లేదా ట్రేడ్ యూనియన్ బాడీలు రావాలి. హీరోలు వచ్చి నమస్కారాలు పెట్టాలనేంత కిందిస్థాయి వ్యక్తులం కాదు. ఎన్టీఆర్ పాటించిన ఔన్నత్యాన్ని మేం కొనసాగిస్తున్నాం. ఆయన రాజకీయాలతో సంబంధం లేకుండా తోటి నటులను గౌరవించేవారు. సినీ పరిశ్రమపై మా కూటమి ప్రభుత్వానికి గౌరవం ఉంది. సీఎం చంద్రబాబు తెలుగు సినీ పరిశ్రమను ఎప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉన్నారు. నిజ జీవితంలో జరగని సంఘటనలు సినిమా ప్రపంచంలో స్ఫూర్తినిస్తాయి. సినిమా మంచి, చెడు రెండింటినీ చూపిస్తుంది. ఏది తీసుకోవాలో ప్రేక్షకుల ఇష్టం. కేవలం డబ్బులు సంపాదించడం కాదు.. విలువలు నేర్పించండి.
“ఆంధ్రప్రదేశ్ లో బలమైన యువత ఉంది. తెలంగాణ ఫిల్మ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ అయిన దిల్ రాజు గారికి ఈ సందర్భంగా ఒక సూచన చేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ ను చిన్నచూపు చూడకండి. తెలుగు చిత్ర పరిశ్రమ అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ లో అద్భుతంగా ఉండాలి. ఇక్కడ యువతలో ఉన్న శక్తిని వినియోగించుకోండి. రాష్ట్రంలో పలు చోట్ల స్టంట్ స్కూల్స్ పెట్టండి. సినీ పరిశ్రమలో ఉన్న నిపుణులతో యువతలో నైపుణ్యాభివృద్ధిని పెంచండి. దర్శకులు రాజమౌళి, త్రివిక్రమ్ లాంటి వ్యక్తులను తీసుకొచ్చి స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే తదితర విషయాలపై క్లాస్లు తీసుకోమని చెప్పండి. కీరవాణి, తమన్ లాంటి వాళ్ల ద్వారా సంగీతంపై అవగాహన పెంచండి. స్టూడియోలు పెట్టండి. 24 క్రాఫ్ట్ లకు సంబంధించిన విషయాలు నేర్పండి. ప్రొడక్షన్ డిజైన్ కు సంబంధించిన స్కూల్స్ పెట్టండి. నేను టీవీని కూడా ఎప్పుడూ చిన్న చూపులేదు. ఏపీలో పర్యాటకాభివృద్ధికి సహకారం అందించండి” అని పవన్ కల్యాణ్ అన్నారు.


Be the first to comment