వై-ఫై పాస్‌వర్డ్‌ గుర్తులేదా?

ఇంటికి అతిథులు వచ్చారు. వై-ఫై పాస్‌వర్డ్‌ ఏంటని అడిగారు. అదేంటో చప్పున గుర్తుకు రాదు. ఆ మాటకొస్తే పూర్తిగా మరచిపోయారు. ఇలాంటి పరిస్థితి చాలామంది ఎదుర్కొంటూనే ఉంటారు. మరి వై-ఫై పాస్‌వర్డ్‌ను తెలుసుకోవటమెలా? కనెక్ట్‌ అయి ఉన్న పరికరాలతో త్వరగా, సులభంగా తెలుసుకోవచ్చు.

ఆండ్రాయిడ్‌ ఫోన్‌లో..
గూగుల్‌ పిక్సెల్‌ ఫోన్‌ వాడేవారు సెటింగ్స్‌ ద్వారా నెట్‌వర్క్‌లోకి, అక్కడి నుంచి ఇంటర్నెట్‌ విభాగంలోకి వెళ్లాలి. అప్పటికే కనెక్ట్‌ అయి ఉన్న వై-ఫై నెట్‌వర్క్‌ పేరు పక్కనుండే గేర్‌ గుర్తు మీద క్లిక్‌ చేయాలి. అప్పుడు మరో పేజీ ఓపెన్‌ అవుతుంది. అందులో షేర్‌ మీద క్లిక్‌ చేసి ఐడీని కన్‌ఫర్మ్‌ చేసుకోవాలి. లాగిన్‌ వివరాలను షేర్‌ చేయటానికి క్యూఆర్‌ కోడ్‌ కనిపిస్తుంది. ఇందులో వై-ఫై పాస్‌వర్డ్‌ కూడా ఉంటుంది.

సామ్‌సంగ్‌ గెలాక్సీ యూజర్లయితే- సెటింగ్స్‌ ద్వారా కనెక్షన్స్‌లోకి వెళ్తే వై-ఫై ఆప్షన్‌ కనిపిస్తుంది. కనెక్టెడ్‌ వై-ఫై నెట్‌వర్క్‌ పక్కన గేర్‌ గుర్తు మీద క్లిక్‌ చేయాలి. తర్వాత చుక్కలతో కూడిన పాస్‌వర్డ్‌ బాక్స్‌ పక్కన కన్ను గుర్తు మీద తాకి, ఐడీని ధ్రువీకరించుకోవాలి. అప్పుడు టెక్స్ట్‌ రూపంలో పాస్‌వర్డ్‌ కనిపిస్తుంది.

అన్నిరకాల ఆండ్రాయిడ్‌ ఫోన్లలో వై-ఫై కన్ఫిగరేషన్‌ పేజీలు దాదాపు ఇలాగే ఉంటాయి. అయితే వై-ఫై పాస్‌వర్డ్‌ను మార్చినట్టయితే ఈ చిట్కాలు పనిచేయవని తెలుసుకోవాలి. మార్చినవారి నుంచి కొత్త పాస్‌వర్డ్‌ను తెలుసుకోవటం తప్ప మరో మార్గం లేదు.

విండోస్‌లో..
ల్యాప్‌టాప్‌ లేదా పీసీలో సెటింగ్స్‌ జి స్టార్ట్‌ మెనూ జి నెట్‌వర్క్‌ఖీఇంటర్నెట్‌ జి వై-ఫైలోకి వెళ్లాలి. అన్నింటికన్నా పైన కనెక్ట్‌ అయిన నెట్‌వర్క్‌ కనిపిస్తుంది. పేరు మీద క్లిక్‌ చేస్తే వై-ఫై నెట్‌వర్క్‌ ప్రాపర్టీస్‌ తెలుస్తాయి. కొత్తగా ఓపెన్‌ అయిన పేజీలో వ్యూ వై-ఫై సెక్యూరిటీని గుర్తించి వ్యూ మీద క్లిక్‌ చేయాలి. కొత్త డైలాగ్‌ బాక్స్‌లో వై-ఫై పాస్‌వర్డ్‌ ఉంటుంది.

మ్యాక్‌ఓఎస్‌లో..
సిస్టమ్‌ సెటింగ్స్‌ ద్వారా వై-ఫైలోకి వెళ్లి కిందికి స్క్రోల్‌ చేసి నోన్‌ నెట్‌వర్క్‌ మీద క్లిక్‌ చేయాలి. రెండో జాబితా పక్కనుండే మూడు చుక్కలను తాకి పాస్‌వర్డ్‌ను కాపీ చేయాలి. నోట్స్‌ లేదా పేజెస్‌ యాప్‌లోకి వెళ్లి పేస్ట్‌ చేయాలి. దీంతో పాస్‌వర్డ్‌ సాదా టెక్స్ట్‌ రూపంలో కనిపిస్తుంది.

ఐఫోన్లలో..
ఐఫోన్లలో ఈ ప్రక్రియ కాస్త తేలికే. మెయిన్‌ సెటింగ్స్‌ యాప్‌లోకి వెళ్లి వై-ఫై మీద క్లిక్‌ చేయాలి. నెట్‌వర్క్‌ పక్కనుండే నీలం వృత్తాన్ని తాకాలి. పాస్‌వర్డ్‌ మీద క్లిక్‌ చేస్తే ఐఫోన్‌ పాస్‌కోడ్‌ లేదా ఫేస్‌ ఐడీతో ధ్రువీకరించు కోవాలని అడుగు తుంది. వీటిని పూర్తి చేయగానే పాస్‌వర్డ్‌ ప్రత్యక్షమవుతుంది.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*