బహుదూరపు బాటసారి దాసరి గారికి అశ్రు నివాళితో…
నిత్య కృషీవలుడు నిస్సత్తువగా మారి తనువు చాలించిన రోజు నేడే… దక్షిణ భారత సినీ చరిత్రలో ఒక అధ్యాయం ముగుసిన రోజు నేడే. బహుముఖ ప్రజ్ఞాశాలి, సినీ పరిశ్రమలో ఉన్న 24 క్రాఫ్ట్స్ పై పట్టు కలిగి, యావత్తు తెలుగు సినీ పరిశ్రమనే చివరి వరకు తన చుట్టూ తిప్పుకున్న మేస్త్రి డాక్టర్ దాసరి నారాయణ రావు గారు పరలోకములకు చేరుకొన్న రోజు నేడే.
గురువు గారు స్వర్గీయ డాక్టర్ దాసరి నారాయణ రావు గారు, మే 4న పాలకొల్లులో జన్మించి, మే 30, 2017 న హైదరాబాదు లో పరమపదించారు.
తనకు అవసరం లేని వైద్యం కోసం వెళ్లి, కారణాంతరాల వల్లనో లేక విధి వైపరీత్యం వల్లనో, నిస్సత్తువగా మారి, తన చుట్టూ ఉన్న పంచభూతాలకు లోంగి దాసరి గారు పై లోకాలకు చేరుకోవడం అనేది విచారకరం.
ఒక సంపూర్ణ ఆరోగ్య వంతుడైన దాసరి గారు, తనకు అంటుకున్న బొగ్గుమసిని వదిలించు కోవాలి అని తలుస్తూ అకారణంగా ఆసుపత్రి పాలయ్యారు అని అంటుంటారు. అక్కడ నుండి ఆయనకు అకాలపు ఆరోగ్య కష్టాలు మొదలు అయ్యాయి అని చెప్పాలి.
కొన్ని వందల పాత్రలను సృష్టించి, వారి సైకాలజీతో ఆడుకున్న దాసరి, తన నిజ జీవితంలో తన చుట్టూ ఉన్న కోటరీ అనే శత్రు శ్రేయోభిలాషుల సైకాలజీని దాసరి తెలుసుకోలేక పోయారు అని కూడా అంటుంటారు. ఎంతైనా విధి బలీయ మైనది. దాని నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు.
ఆయన ఆరోగ్య సమస్య అనేది ఆయన స్వయం కృతాపరాధం. కాదు కాదు తన చుట్టూ ఉన్న పంచ భూతాల కుట్ర అని అంటుంటారు. నిజం ఆ పంచభూతాలకు మాత్రమే ఎరుక. అదే విధి వ్రాత అనుకుంటా.
తన కుటుంబానికి, తన కులానికి దాసరి ఏమి చేశారు అనే విషయాన్ని పక్కన పెట్టాలి. దాసరి కులాలకు, మతాలకు అతీతంగా తన శిష్య లోకాన్ని ఏర్పరచుకున్నారు, దాసరి చివరి వరకు తన జీవితాన్ని తనను నమ్ముకున్న వారికి ఆండగా ఉండడానికే అంకితం చేశారు అని చెప్పాలి. ఆయన ఇంట ఎప్పుడూ ఒక వంద మంది భోజనం చేస్తూ ఉండేవారు.
“నేను విష సర్పాల మధ్య సేద తీరుతున్నాను. ఏ రోజునైతే ఆ విష సర్పాలను నేను ఆడించడం మానేస్తానో, ఆరోజునే ఆ విష సర్పాలు నన్ను కాటేస్థాయి” – పిచ్చోడి చేతిలో రాయి సినిమాలో దాసరి అన్న పై మాటలు నాకు ఇప్పటికీ గుర్తు కొస్తుంటాయి.
గురువు గారు దాసరి లాంటి మహోన్నతులను, అదృశ్య సర్పాలు ఏమైనా లొంగ దీసుకొన్నాయా లేక సేద తీర్చి ఆదుకోన్నాయా అనేది చుట్టూ ఉన్న ఆ “పంచ భుతాలకే” తెలియాలి…
భవిషత్తు రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి అని చెప్పడం కోసం “రౌడీ దర్బార్” లాంటి గొప్ప గొప్ప చిత్రాలను తీసిన మా భోళాశంకరుడు “ఆ శంకరుడి”లో ఐక్యం చెందారు. స్వర్గీయ దాసరి నారాయణ రావు గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుని ఆశీస్సులు కలగాలని సదా కోరుకొంటూ….


Be the first to comment