పట్టు తప్పిన టిటిడి పాలన గాడిలో పడుతుందా?
దేవుడు సొత్తు దిగ మింగిన దొంగలపై చర్యలు ఉంటాయా..!?
చంద్రబాబు ఆలోచనలను బిఆర్ నాయుడు అమలు చేయగలరా..!?
ధార్మిక సంస్థ లో ధర్మాన్ని నెలకొల్పుతారా..!?
టీటీడీ నిధుల దుర్వినియోగాన్ని అరికడతారా?
భక్తుల మనోభావాలకు ప్రాధాన్యత ఇస్తారా..!?
ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది భక్తులకు ఆరాధ్య దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి వారి కొలువు ధర్మకర్తల మండలిలో నేడు నూతన సభ్యులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. తొలిసారిగా మీడియా దిగ్గజం బొల్లినేని రాజగోపాల్ నాయుడు టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడి హోదాలో స్వామివారి సేవకు అంకితం కానున్నారు. గత ఐదేళ్ల వైసిపి అస్తవ్యస్త పరిపాలనలో గాడి తప్పిన ధార్మిక సంస్థ పరువు ప్రతిష్టలను గాడిలోకి తీసుకొచ్చి భక్తుల మనో అభిప్రాయాలకు అనుగుణంగా దేవదేవుడి కొలువులో ప్రశాంతతను పవిత్రతను నెలకొల్పే లక్ష్యంతో చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా పనిచేయాలనే లక్ష్యంతో ఇలాంటి కీలక సమయంలో ధార్మిక సంస్థ చైర్మన్ గా బాధ్యతలను నిర్వహించాల్సి రావడం నిజంగా బి ఆర్ నాయుడు లాంటి వ్యక్తులకు కత్తి మీద సాము లాంటిదే. ఇప్పటివరకు ధర్మకర్తల మండలి అధ్యక్షులుగా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు మాత్రమే పనిచేశారు. సభ్యులుగా గతంలో ఇండియన్ ఎక్స్ప ప్రెస్ పత్రిక అధిపతి గోయెంకా లాంటి ప్రముఖులు కొందరు ఉన్నప్పటికీ అధ్యక్షుడు హోదాలో తొలిసారిగా మీడియా పరంగా అవకాశం దక్కింది బి ఆర్ నాయుడు కి మాత్రమే.
గత ఐదేళ్ల వైసిపి పాలనలో ప్రభుత్వ రంగాల్లోని అన్ని విభాగాలను నిర్వీర్యం చేసిన పాలకులు టీటీడీ ని కూడా ఇష్టానుసారంగా బ్రష్టు పట్టించారు. నిధులను ఇష్టానుసారంగా నొక్కేశారు. జగన్మోహన్ రెడ్డికి పాదదాసుడైన అధర్మారెడ్డి ని టీటీడీ ఈవోగా అన్ని పదవులను ఆయనకే కట్టబెట్టి ఇష్టానుసారంగా దేవుడి సొమ్మును దిగమింగారు. అధర్మా రెడ్డి కూడా తన ఇష్టానుసారంగా ప్రవర్తించి అధికార దుర్వినియోగానికి పాల్పడి వైయస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయనపై ఉన్న కేసులను దృష్టిలో ఉంచుకొని ఆయనకు మేలు చేసేందుకు వ్యవస్థలను మేనేజ్ చేసేందుకు దేవుడి దర్శనాన్ని టిటిడిని ఇష్టానుసారంగా వాడుకున్నారు. భూమన కరుణాకర్ రెడ్డి, వై వి సుబ్బారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తదితర రెడ్డి ద్వయం అంతా కలిసి ఇష్టానుసారంగా భక్తులు దేవుడికి వేసిన కానుకలను కాంట్రాక్టర్ల రూపంలో కమీషన్ల రూపంలో మొత్తం సంస్థను ఊడ్ఛేశారు. ఏడాదికి 3000 కోట్ల బడ్జెట్ ఉన్న టిటిడి సంస్థలో చైర్మన్ గా పనిచేసిన భూమన కరుణాకర్ రెడ్డి తన నాలుగు మాసాల పాలనలోనే 3850 కోట్ల కాంట్రాక్టులను నిధులను మంజూరు చేసి ఒక్కసారిగా టీటీడీ బొక్కసాన్ని ఖాళీ చేశారు. ఆగమేఘాలపై తిరుపతిలోని రెండు మూడవ సత్రాలను కూలదోసి వాటి స్థానాల్లో కొత్త భవనాలను నిర్మించేందుకు ఏర్పాట్లు చేయడం వివాదాస్పదమైంది.
అంతకంటే ప్రధానంగా తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదాలను తయారీ కోసం వినియోగించే నెయ్యిలో కల్తీ చేసి పవిత్రమైన ప్రసాదాల ను కూడా అపవిత్రం చేశారు. కోట్లాది రూపాయలను తన అనుచరులకు కట్టబెట్టేందుకు నాసిరకం గల నెయ్యిని టీటీడీకి సరఫరా చేసి అందులో ఎవరూ ఊహించని విధంగా పంది కొవ్వు ,గొడ్డు కొవ్వు, వెజిటేబుల్ నూనె తదితర వాటిని కలిపి దేవుడి ప్రసాదాలను అపవిత్రం చేశారు. అన్నదానంలో సైతం అన్న ప్రసాదాలకు వినియోగించే బియ్యం నాసిరకం బియ్యాన్ని సరఫరా చేస్తూ భక్తుల మనోభావాలకు విలువ లేకుండా అనేక ఆరోపణలు వచ్చినప్పటికీ పట్టించుకోకుండా ఒక విధంగా హిందూ ధర్మాన్ని అపహాస్యం చేసే విధంగా వైసీపీ ప్రభుత్వం టిటిడితో చదరంగం ఆడిందని చెప్పొచ్చు. శ్రీవాణి ట్రస్ట్ పేరిట టీటీడీకి రావాల్సిన డబ్బులు నేరుగా టీటీడీకి చెందకుండా, ట్రస్ట్ ద్వారా అవక తవకలకు అవకాశం ఏర్పడేలా దాదాపు 1500 కోట్లు నిధులకు లెక్క లేకుండా భక్తులకు కనీసం రసీదు కూడా ఇవ్వకుండా వివాదాస్పదంగా వ్యవహరించారు. ఈ శ్రీవాణి ట్రస్టు నిధులు దళితవాడల్లో దేవాలయాల పునర్నిర్మాణం పేరిట ఇతరత్రా కొన్ని కోట్ల రూపాయలను లోపాయికారిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తరలించినట్లు అప్పటి ఈవో ధర్మారెడ్డి పై ఆరోపణలు వెల్లువెత్తాయి. అంతేకాకుండా తిరుమల కేంద్రంగా న్యాయ వ్యవస్థను కూడా మేనేజ్ చేసి చంద్రబాబును 52 రోజులపాటు జైల్లో పెట్టిన అంశంలో అధర్మారెడ్డి ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పి వైఎస్ జగన్ కు సహకరించినట్లు ఇంటిలిజెన్స్ వర్గాల ద్వారా నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం కనుగొన్నారు. ఇలా అనేక దుర్మార్గాలపై విజిలెన్స్ విచారణకు ఆదేశించినా రాష్ట్ర ప్రభుత్వం దానిపై ఇంకా ఎటువంటి చర్యలు లేకుండా అనిస్థితి పరిస్థితుల్లోనే ఉండడం గమనార్హం.
వాస్తవానికి ప్రస్తుతం టిటిడి చైర్మన్ తో సహా నియమితులైన 24 మంది సభ్యులందరూ సేవా దృక్పథం కలిగి ఉన్న వ్యక్తులనే నియమించడం జరిగింది. ఒకరిద్దరిపై ఆరోపణలు ఉన్నప్పటికీ వారు గత వైసిపి ప్రభుత్వం లో కూడా సభ్యులుగా చేశారని ఆరోపణలు వచ్చాయి. ఏది ఏమైనప్పటికీ టిటిడి కొలువులో క్రిమినల్స్ కాకుండా, డబ్బుపై సంపాదనపై, ఆశ లేని, భక్తి తత్వం కలిగిన ప్రముఖులనే నియమించి, చాలావరకు విమర్శలకు అడ్డుకట్ట వేయగలిగారు ముఖ్యమంత్రి చంద్రబాబు. అందులోనూ అన్ని ప్రాంతాలకు ప్రాధాన్యత ఇస్తూ, కూటమి ప్రభుత్వ సాంప్రదాయాలను గౌరవిస్తూ అందరికీ సమ ప్రాధాన్యత ఇవ్వగలిగారు. మరోవైపు పాలకమండలి ఏర్పడక మునుపు కూటమి ప్రభుత్వం ఏర్పడగానే, టీటీడీ కార్యనిర్వహణాధికారిగా నియమితులైన శ్యామలరావు, అదనపు కార్యనిర్వహణాధికారిగా నియమించిన వెంకయ్య చౌదరి టీటీడీ పరిపాలనపై అనుభవం లేనప్పటికీ కూడా తమదైన శైలిలో టీటీడీలో పట్టు సాధించి, ప్రధానంగా దేవుడి ప్రసాదాల కల్తీని బయటపెట్టి, లడ్డు ప్రసాదం నాణ్యతను, అన్నదానంలో అన్న ప్రసాదాల నాణ్యతను పెంపొందించి భక్తుల చేత ప్రశంసలు అందుకున్నారు. ధర్మకర్తల మండలి లేకపోయినా శ్రీవారి బ్రహ్మోత్సవాలను సమర్థవంతంగా చాలా చక్కగా నిర్వహించగలిగారు. టీటీడీ ఈవో తో పాటు మరికొంతమంది ఐఏఎస్ అధికారులను ఎక్స్ అఫిషియో సభ్యులుగా ధర్మకర్తల మండలిలో రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.
ఇప్పుడు నూతన ధర్మకర్తల మండలి ముందున్న కొన్ని ప్రధానమైన అంశాలు….
** ఇటీవల కాలంలో చాలావరకు శ్రీవారి దర్శనం కల్పించే విషయంలో భక్తుల సంఖ్య చాలా వరకు తగ్గింది. కనీసం అంటే 70 వేలకు మించలేదు. దీన్ని రోజుకు లక్ష మంది వరకు కల్పించే దిశగా చర్యలు తీసుకోవాల్సి ఉంది. గతంలో పనిచేసిన కొంతమంది ఐఏఎస్ అధికారులు లక్ష మంది భక్తులు వరకు స్వామి దర్శనాన్ని కల్పించిన పద్ధతులను అధ్యయనం చేయాల్సి ఉంది. దేవుడు దర్శనం కోసం కిలోమీటర్ల కొద్దీ భక్తులు చలిగాలుల్లో వేచి ఉండే పరిస్థితి లేకుండా వారందరికీ త్వరితగతిన దర్శనం కల్పించేలా మౌలికమైన ఏర్పాట్లు ఉండేలా చూడాల్సి ఉంది.
** శ్రీవాణి ట్రస్ట్ పేరిట ఇప్పటివరకు లెక్క తేలకుండా ఉన్న 1500 కోట్ల రూపాయలను పూర్తిగా పారదర్శకంగా పరిశీలించి ఆ నిధులు ఎక్కడికెళ్లాయో..,,? భక్తులకు ఎందుకు రసీదులు ఇవ్వకుండా… సాంకేతికపరంగా టీటీడీకి డబ్బు చెల్లించకుండా ఇతర ట్రస్టులకు డబ్బులు ఎందుకు చెల్లించారు..? ఆ డబ్బులు టీటీడీకి తిరిగి వచ్చాయా లేదా వీటిపై ఏ మేరకు గోల్మాల్ జరిగింది. టీటీడీలోని ఆడిటింగ్ విభాగం చీఫ్ అకౌంట్ ఆఫీసర్ పాత్ర ఎంత..? ఇలాంటి భక్తుల్లో కలిగిన అనుమానాలు అన్నింటిని నివృత్తి చేసేలా చర్యలు తీసుకోవాలి. ఇకపై శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల ద్వారా భక్తుల నుండి వసూలు చేసే సొమ్ము నేరుగా టీటీడీ అకౌంట్ కు జమ అయ్యేలా చూడాల్సి ఉంది.
** ధర్మకర్తల మండలి లో పనిచేసే సభ్యులందరూ గతంలో లా కాకుండా విఐపి బ్రేక్ దర్శనాల కోసం… వాటి కోటాల కోసం పట్టు పట్టకుండా భక్తుల సమస్యలపై వారికి చేయాల్సిన సేవలపై దృష్టి సారించాలి.
పాలకమండలి సమావేశాల్లో గత వైసిపి ప్రభుత్వం తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలపై పునసమీక్షించాలి. కోట్లాది రూపాయల నిధుల కేటాయింపులను పరిశీలించి వీలైతే వాటన్నింటిని వెనక్కి తెప్పిస్తూ కొన్ని టెండర్లను పూర్తిగా రద్దు చేయాలి.
తిరుమల కొండపై వైసిపి పాలకుల ఒత్తిడితో ఇష్టానుసారంగా వెలిసిన అక్రమ దుకాణాలు, హాకరు లైసెన్సులు అన్నింటిని రద్దుచేసి, వాటిని తొలగించి పారదర్శకంగా తిరుమలలోని స్థానికులకు మాత్రమే అవకాశం ఉండేలా కొత్త నిబంధనలను తీసుకురావాలి. టిటిడి రెవెన్యూ విభాగంలో ఎస్టేట్ పంచాయతీ విభాగంలో తిష్ట వేసిన అవినీతి అధికారులను విచారణ జరిపి వారిపై శాఖా పరమైన చర్యలు తీసుకొని, వారి అవినీతి సొమ్మును తిరిగి దేవుడికి జమ చేయాలి.
పాలకమండలిలో తీసుకుంటున్న ప్రతి నిర్ణయాన్ని టీటీడీ వెబ్సైట్ ద్వారా పారదర్శకంగా భక్తులందరికీ తెలిసేలా ఉంచాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా రాజకీయ నాయకుల ఒత్తిడి తగ్గేలా టీటీడీలో కొన్ని చర్యలు తీసుకోవాలి.
టీటీడీలో శాశ్వత ఉద్యోగులు దాదాపు 20 వేల సంఖ్య నుండి ప్రస్తుతం ఏడూ వేలకు పడిపోయింది. అవుట్ సోర్సింగ్ విధానం ద్వారా పనిచేసే ఉద్యోగుల సంఖ్య 7వేల నుండి ఇప్పుడు 18 వేలకు చేరుకుంది. ఈ పరిస్థితికి పూర్తిగా చరమగీతం పాడి పర్మనెంట్ ఉద్యోగుల సంఖ్య పెంచుతూ టీటీడీలో బాధ్యతాయుతమైన పరిపాలన పెంపొందించాల్సిన అవసరం ఉంది.
అలాగే టీటీడీకి తెల్ల ఏనుగుల్లా తయారైన కొంతమంది డిప్యూటేషన్ అధికారుల సీట్లను కదిలించి వారిని మాతృ శాఖకు పంపించాల్సిన అవసరం ఉంది. అదే స్థాయిలో టీటీడీలోని కింది స్థాయి ఉద్యోగులకు ఎప్పటికప్పుడు ప్రమోషన్లు ఇచ్చి వారిని అన్ని విధాల సమర్థవంతమైన ఉద్యోగులుగా అధికారులుగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉంది.
ఇంకా అనేకమైన ముఖ్యమైన సమస్యలు పరిస్థితులు టీటీడీలో ఏర్పడుతున్నాయి. వాటన్నింటినీ ప్రత్యేక దృష్టి సారించి ఒత్తిడి లకు లోను కాకుండా పరిష్కార మార్గాలు చూపాల్సి ఉంది. వీటన్నింటిపై మీడియా సంస్థ ద్వారా ఎన్నో కథనాలు వెలువరించిన ప్రస్తుత టీటీడీ చైర్మన్ బి.ఆర్ నాయుడు ఇప్పుడు తానే ఈ స్థానంలో కూర్చున్నప్పుడు మరింత బాధ్యతగా సమర్థవంతంగా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది.


Be the first to comment