వినుకొండలో కన్నుల పండువగా మహారుద్రాభిషేకం
వినుకొండలో మహారుద్రాభిషేకం కార్యక్రమం ఆదివారం కన్నులపండువగా సాగింది. పవిత్ర కార్తికమాసంలో శంఖం, ఢమరుకం, ఘంటానాదం, మంగళ ధ్వనులతో అశేష జనవాహిని మధ్య మహాదేవుని మహా రుద్రాభిషేకం, భస్మాభిషేకం నేత్రపర్వంగా జరిగింది. లోక కల్యాణార్థం స్థానిక జూనియర్ కళాశాల ఆవరణలో అమ్మ ఛారిటబుల్ ట్రస్టు నిర్వహణలో స్థానిక ఎమ్మెల్యే జీవీ ఆంజనేయుు సహకారంతో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. అమ్మ ట్రస్టు వ్యవస్థాపకులు జ్ఞానప్రసన్న స్వామిజీ తన శిష్యులతో ఈ మహా రుద్రాభిషేకం నిర్వహించా రు. ఎమ్మెల్యే జీవీ దంపతులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు అతిథులుగా పాల్గొన్న ఈ వేడుకలో 7 అడుగుల మృత్తికా శివలింగానికి ప్రత్యేకపూజలు చేశారు. శివలింగానికి పసుపు, కుంకుమ, భస్మం, ఫల రసాలు, పలు రకాల పూలు, లక్ష రుద్రాక్షలు, గంధం, సుగంధ ద్రవ్యాలు, జలాలతో మహా రుద్రాభిషేకం కొనసాగింది. అనంతరం శివుడికి హారతి, నైవేద్యం, పట్టాభిషేకం కార్యక్రమాలు నిర్వహించారు. పెదసంఖ్యలో తరలి వచ్చిన భక్తులు, హర హర మహాదేవ శంభోశంకర నినాదాలతో జూనియర్ కళాశాల ప్రాంగణం దద్దరిల్లింది. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే జీవీ ఈ కార్యక్రమంలో పాల్గొనే అదృష్టం భగవంతుడు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నానని తెలిపారు. సిరిసంపదలు ఆరోగ్యం, ఆయుష్ అన్నీ ఆ పరమేశ్వరుడి ప్రసాదమే అన్నారు. జ్ఞానప్రసన్న స్వామిజీ విశేష పూజలు నిర్వహించారని ధన్యవాదాలు తెలిపారు. వినుకొండ రామలింగేశ్వర స్వామి పెండింగ్ పనులన్నీ పూర్తయి అదొక మహాక్షేత్రంగా వెలుగొందుతుందనే వారి సంకల్పం నెరవేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ పరమేశ్వరుడిని ఒక్కటే కోరానని, అందరికీ ఆరోగ్యం, ఆనందం, అభివృద్ధి ప్రసాదించమని కోరుకున్నట్లు పేర్కొన్నారు. నదుల అనుసంధానం పూర్తి కావాలని ఆ పరమేశ్వరుడిని మనస్ఫూర్తిగా కోరినట్లుగా చెప్పారు. రామలింగేశ్వరస్వామి గుడికి కొత్త కమిటీ నియమించి నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు. గుడిమెట్ల మార్గం పూర్తి చేసేందుకు కమిటీని ఏర్పాటు చేసుకోవాలని కృష్ణాంజనేయులుకు బాధ్యతలు అప్పగించామన్నారు. కమిటీతో పాటు ప్రజలు కూడా విరాళాలు ఇచ్చి గుడిఅభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. జ్ఞాన ప్రసూన స్వామిజీ 30 ఏళ్లుగా ఎన్నో సేవా కార్యక్రమాలు, ఆకలితో వచ్చిన వారికి అన్నం పెట్టడం, అనాధ పిల్లలను చదివించడం వంటి ఎన్నో అమ్మ అశ్రమం ద్వారా చేపడుతున్నారని, అందుకు ఆయనను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు తెలిపారు. కరోనా సమయంలో ఎంతో మంది అనాథ శవాలకు, బంధువులు వదిలివేసిన పార్థీవదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారని గుర్తు చేసుకున్నారు. అమ్మ ఛారిటబుల్ ట్రస్టుకు శివశక్తి ఫౌండేషన్ కూడా తోడు ఉంటుందని, భవిష్యత్తు లో మరెన్నో మంచి పనులు చేయాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. రామలింగేశ్వర స్వామి గుడి అభివృద్ధికి రూ.2 కోట్ల నిధులు ఇచ్చిన సీఎం చంద్రబాబుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. రానున్న రెండేళ్లలో ఈ నిర్మాణాలన్నీ పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని స్పష్టం చేశారు. ఈ సందర్భంగానే ఫిరంగిపురం మండలం వేమవరంలో జ్ఞానప్రసన్న స్వామిజీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న కోటిలింగాల ఆలయ నిర్మాణంలో ప్రతిఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరారు. తన వంతుగా దేవాలయం నిర్మాణానికి రూ.5 లక్షల విరాళం అందిస్తున్నట్లు ఎమ్మెల్యే జీవీ ప్రకటించారు.


Be the first to comment