అధికారికి స్వీయానుభవం ప్రాణ మీదకు తెచ్చిన కాలినడక

ఇదే గిరిజనం అసలు వెత… రాదారి అష్టకష్టాల కథ

అధికారికి స్వీయానుభవం ప్రాణ మీదకు తెచ్చిన కాలినడక

కొన ఊపిరితో వైద్య సాయం కోసం గిరిజనం పడే అష్టకష్టాల అనుభవాన్ని అధికారులు పంచుకున్నారు. గిరిజనులే డోలీ కట్టి ఆదుకోకపోతే… ఓ అధికారి ప్రాణాలు గాలిలో కలసిపోయేవి. తరతరాలుగా గిరిజనం వైద్య సాయం కోసం తపిస్తున్న తీరు.. డోలీ మోతల కష్టాలను ఇప్పటి వరకూ పతాక శీర్షికల్లోని వార్తను గమనించిన అధికారులు.. తాజాగా స్వయంగా వీక్షించారు. ఆ మరణ వేదనను అనుభవించారు. ఈ ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం గుమ్మ పరిధిలోని కర్రిగూడలో జరిగింది. కనీసం ఈ అనుభవంతోనైనా ప్రభుత్వానికి కచ్చిత నివేదిక అందిస్తే.. ఆ అధికారులు గిరిపుత్రులకు కృతజ్ఞత తెలిపినట్టే. వివరాల్లోకి వెళదాం. అనంతగిరి మండలంలో మారు మూల పంచాయతీ గుమ్మ పరిధిలోని కర్రిగుడ గ్రామ గిరిజనులు సరైన వైద్యం అందక, రహదారి సౌకర్యం లేక డోలి మోతలతో అల్లాడిపోతున్నారని ఇటీవల పత్రికలు ఘోషించాయి. ఈ కథనాలపై జిల్లా కలెక్టర్ చలించిపోయారు. తీవ్రంగా స్పందించారు. తక్షణమే మండల అధికారయంత్రాంగం మొత్తం కర్రిగూడ వెళ్లి,.. పరిస్థితిని పరీక్షించి పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఈ ఆదేశాల మేరకు ఎంపీడీవో ఏవివి కుమార్, తాహసీల్దార్ మాణిక్యం, ఈవోపీఆర్డీ సీతయ్య, అర్. ఐ శంకర్రావు, లంగపర్తి వైద్యాధికారిణి మంజు భార్గవి, సచివాలయ సిబ్బంది కర్రిగూడకు బయలుదేరారు. 8 కిలోమీటర్లు నడిచారు. ఆపసోపాలు పడుతూ కర్రిగూడ గ్రామానికి చేరుకున్నారు. వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. గ్రామంలోని ప్రతి ఒక్కరికి వైద్య పరీక్షలు నిర్వహించారు. గిరిజనం కూడా అధికారుల చర్యల పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ధన్యవాదాలు తెలిపారు. కానీ ఇక్కడే పెద్ట ట్విస్ట్ … అధికారులను కుదిపేసింది. 8 కిలోమీటర్లు నడచి వచ్చిన అధికారుల్లో ఎంపీడీవో అలసి పోయారు. సొలసి పోయారు. తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. అంతే అక్కడి ఆఫీసర్లు, సిబ్బందికి గుండె ఆగినంత పని జరిగింది. వీరితోపాటు వైద్యాధికారి అందుబాటులో ఉండటంతో ఆయన బతికి బట్టకట్టగలిగారు. అక్కడే ఉన్న డాక్టర్ మంజూభార్గవి ఎంపీడీవో ఆరోగ్య పరిస్థితిని అంచనా వేశారు. తక్షణమే వైద్య సాయం కోసం ఆసుపత్రికి తరలించాలని కోరారు. తమ ప్రాణాలను, ఆరోగ్యాన్ని కాపాడటానికి వచ్చిన అధికారే ప్రాణాపయ స్థితికి చేరుకోవటంతో గిరిజనం అల్లడిపోయారు. డోలీ కట్టారు. హుటాహుటిన ఎంపీడీవోనూ సురక్షిత ప్రాంతానికి తరలించారు. 108 వాహనం ఎక్కించారు. ఆయనను ఆసుపత్రికి చేర్చారు. సకాలంలో వైద్య సాయం అందటంతో ఆ ఎంపీడీవో ఆరోగ్యం కుదుట పడింది. ఆయన కుటుంబం ఊపిరి పీల్చుకుంది.

అసలేం జరిగిందంటే..

కర్రిగూడ గ్రామంలో గత కొన్ని రోజులుగా గిరిజనం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు విరోచనాలతో బాధపడుతున్నారు. ఈ స్థితిలో డోలిమాతతో ఆసుపత్రులకు తరలించినా ఫలితం దక్కటం లేదు. గిరిజనం అవస్థలు, ఆవేదనను వెళ్లగక్కుతూ ఇటీవల మీడియా ప్రతినిధులు వార్తలు ఇచ్చారు. ఈ వార్త కథనాలు జిల్లా కలెక్టర్ ను కదిలించగా.. ఆ గ్రామానికి అధికారుల బృందాన్ని పంపించారు. ఈ ఘటనతో ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, తమ గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించి. డోలి మోత ల నుంచి విముక్తి ప్రసాదించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

AD

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*